దేశంలోనే మొదటి లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్
పెంజర్లలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు అంతా లిక్విడ్ డిటర్జెంట్దేనని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్‌జీ) పరిశ్రమలో తొలి లిక్విడ్ డిటర్జెంట్ ప్లాంట్‌ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను పీఅండ్‌జీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఆరేండ్ల క్రితం పీఅండ్‌జీ పరిశ్రమను సీఎం కేసీఆర్ ప్రారంభించారని, ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 170 ఎకరాలను కేటాయించిందని గుర్తుచేశారు.
35 శాతం భూమిలో మాత్రమే పీఅండ్‌జీ క్యాంపస్‌ను నెలకొల్పారని.. మిగతా భూములను కూడా సద్వినియోగపరుచుకొంటే.. స్థానికంగా ఉన్న ఆరేడువేల మందికి ఉపాధి లభిస్తుందని నిర్వాహకులకు సూచించారు. కొవిడ్ సంక్షోభం సమయంలో 20 లక్షల శానిటైజర్ బాటిళ్లను, 2 లక్షల మాస్కులను, అంతకు మించి రూ.6 కోట్ల రిలీఫ్ ఫండ్‌ను అందించిన పీఅండ్జీని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, సంబంధిత పరిశ్రమ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మోదీకి విజన్ కొరత
అన్ని కొరతలకు అదే కారణం: కేటీఆర్ ట్వీట్
ప్రధాని మోదీకి విజన్ కొరత కారణంగానే దేశంలో అనేక రంగాల్లో కొరతలు ఏర్పడ్డాయని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించా రు. ‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత.. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత.. పరిశ్రమలకు కరెంట్ కొరత.. యువతకు ఉద్యోగాల కొరత.. గ్రామాల్లో ఉపాధి కొరత.. రాష్ర్టాలకు ఇచ్చే నిధుల్లో కొరత.. అన్ని సమస్యలకు మూలం పీఎం మోదీకి విజన్ కొరత.. ఇదీ ఎన్పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వ అద్భుతమైన పర్ఫార్మెన్స్’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో నెలకొన్న బొగ్గు కొరత, విద్యుత్తు డిమాండ్ వివరాలను తెలిపే డాటాను ట్విట్టర్లో పంచుకున్నారు. ఏఏ రాష్ర్టా ల్లో ఎన్ని గంటలు కరెంట్ పోతుందనే వివరాలు తెలిపే గ్రాఫిక్స్‌ను షేర్ చేశారు.