హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఓ వైపు బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుండగా.. మరోవైపు ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నది. స్థానిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, వారు వెచ్చించాల్సిన వ్యయాలపై గైడ్లైన్స్ విడుదల చేసింది. పోటీచేసే గ్రామంలోను, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి నామినేషన్ల పరిశీలన తేదీనాటికి 21 ఏండ్లు నిండిన వాళ్లు పోటీ చేయడానికి అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అనర్హులుగా ఎస్ఈసీ ప్రకటించింది. జడ్పీటీసీ అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.1.5 లక్షలుగా నిర్ధారించింది.
ఐదు వేల కంటే జనాభా ఎక్కువగా ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షలు, 5 వేల కంటే జనాభా తక్కువగా ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చుపెట్టవచ్చు. అలాగే ఐదు వేలకంటే ఎక్కువ జనాభా న్న గ్రామంలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, ఐదు వేలకంటే తక్కువ జనాభా ఉంటే రూ.30 వేలు మాత్రమే ప్రచారానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి లెక్కలు పొందుపర్చాల్సి ఉంటుంది. పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 45 రోజుల్లో తమ ప్రచార ఖర్చు వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమర్పించాలి. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే పదవులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
బ్యాంకులో డిపాజిట్ చేయాలి
స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ క్యాటగిరీని బట్టి బ్యాంకులో కొంత నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జడ్పీటీసీ స్థానానికి పోటీచేసే జనరల్ అభ్యర్థి రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ స్థానానికి పోటీచేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులు రూ.1,250, సర్పంచ్ జనరల్ అభ్యర్థి రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000, వార్డు సభ్యుడు జనరల్ రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, పంచాయతీ పన్ను బకాయిలతోపాటు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించి రసీదులు సిద్ధం చేసుకోవాలి. కుల, ఆదాయ సర్టిఫికెట్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.