హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ఎలాంటి కుట్ర చేయట్లేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే అధికారులపై దాడి గురించి స్వయంగా మాట్లాడారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రి మాట్లాడారు. కేటీఆర్ సంగారెడ్డి పర్యటనపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. అధికారులను తరిమికొడతామంటూ మాట్లాడిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయని తెలిపారు. కలెక్టర్, గ్రూప్-1 ఆఫీసర్‌పై దాడిచేసి వారిని చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పరిశ్రమలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని, వాటిని నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రి స్పష్టంచేశారు. వరిలో 17 శాతం తేమ నిబంధనలు కేంద్రం పెట్టిందని, ఆ నిబంధనల్లో సవరణలు చేసేలా బీజేపీ నాయకులు ఒప్పించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆ పార్టీ నాయకులకు సూచించారు. ప్రభుత్వం ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని, బోనస్ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.