హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాల తీవత్ర తగ్గింది. గత 24 గంటల్లో 8 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నదని, దీని ప్రభావం వల్ల ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. శనివారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.