హైదరాబాద్ : రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు కురువనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా నగరంలో పొడి, వేడి వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గురువారం సైతం 33.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. కాగా మధ్యాహ్నం భానుడి ప్రతాపం కొనసాగినప్పటికీ సాయంత్రానికి నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం ప్రకారం రానున్న మూడు రోజులు నగరంలో తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు సమాచారం. ఈ రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుంచి 34 డిగ్రీల మధ్య అదే కనిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్య నమోదు కానున్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ములుగు, నిర్మల్, జగిత్యాల, రాంగారెడ్డి, నాగర్‌కర్నూలులో 28 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలోని ఘనపురంలో అత్యధికంగా 29.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.