హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వర జల జాతర అప్రతిహతంగా సాగుతున్నది. బాహుబలి మోటర్ల జల గర్జన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. లక్ష్మీబరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి, అటు రంగనాయకసాగర్‌కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్నది. ఆదివారం రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సరస్వతి, పార్వతి పంప్‌హౌజ్‌ల్లో ఒక్కో పంపును అదనంగా అధికారులు ప్రారంభించారు. మొత్తంగా 37 పంపుల ద్వారా కాళేశ్వర జలాలను లక్ష్మీపంప్‌హౌస్ నుంచి ఎగువన ఎస్సారెస్పీకి, దిగువన రంగనాయకసాగర్ వరకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సారెస్పీలోకి 1.5 టీఎంసీల జలాలను అధికారులు తరలించారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, 3 టీఎంసీలకు, రంగనాయకసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అది పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది.
ప్రాణహితలో పెరిగిన వరద..
ప్రాణహితలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. శనివారం సాయంత్రం నాటికి 24,000 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీబరాజ్‌కు చేరగా, అది ఆదివారం సాయంత్రానికి అది 35 వేల క్యూసెక్కులకు చేరుకున్నది. వానకాలం ఆరంభమైన తరువాత ఇదే అత్యధిక వరద ప్రవాహం కావడం గమనార్హం. రాబోయే రెండు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశమున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో లక్ష్మీబరాజ్ నీటినిల్వ సామర్థ్యం 16.17 టీంఎసీలు కాగా, ఇప్పటికే 11.8 టీఎంసీలకు చేరుకున్నది. వరద ప్రవాహం ఇదే రీతిన కొనసాగితే రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
వరద కాలువ నుంచే కాకతీయ కాలువకు..
కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ, మరోవైపు అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌లోకి తరలిస్తున్న అధికారులు.. వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టారు. అత్యవసరంగా నీరు అవసరమున్న చోట చెరువులను నింపే ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. వరద కాలువతోపాటు లింక్ 4లో ప్యాకేజీ 10, 11, 12 అంటే అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల పరిధిలోని చెరువులను నింపుతున్నారు. వరద కాలువపై 88 కిలోమీటర్ వద్ద నుంచి 3.7 కిలోమీటర్ల పొడవుతో లింక్ కెనాల్‌ను తవ్వి కాకతీయ ప్రధాన కాలువతో 97.46 కిలోమీటర్ వద్ద అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరద కాలువ నుంచే లింక్ కెనాల్ ద్వారా కాకతీయ ప్రధాన కాలువపై డీఎం 83, 86లకు సైతం సాగునీటిని విడుదల చేస్తున్నారు.