ధర్మారం/రామడుగు, ఆగస్టు 14 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హస్లో మూడు పంపుల ద్వారా ఎత్తిపోయగా, గురువారం అధికారులు మరో పంప్ ప్రారంభించారు. బుధవారం ఉదయం 2,4,5వ నంబర్ మోటర్లను ఆన్ చేసి 9,450 క్యూసెకుల చొప్పున నీటి తరలింపు ప్రక్రియను చేపట్టగా, రోజంతా అవే మోటర్లు నడిచాయి. సీఈ సుధాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఉదయం 7:30 గంటలకు 6వ నంబర్ మోటర్‌ను ఆన్ చేశారు. దీంతో నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల గోదావరి జలాలు నంది రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి. ఈ పంప్‌హౌస్‌లో బుధవారం 1,2,4వ నంబర్ల పంపుల ద్వారా 9,450 క్యూసెక్కులు ఎత్తిపోయగా అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయానికి 0.281 టీఎంసీలు తరలించారు. మళ్లీ గురువారం ఉదయం 8.30 గంటలకు అవే పంపులను ప్రారంభించి 9,450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ మరో 0.281 టీఎంసీలను మిడ్ మానేరుకు తరలించినట్టు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు.