సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): తెలుగు ప్రజలు గర్వించదగిన ఒకే ఒక మనసు భాష ఇంద్రజాలికుడు డాక్టర్ బీవీ పట్టాభిరాం అని పలువురు ప్రముఖులు కొనియాడారు. డాక్టర్ బీవీ పట్టాభిరాం రాసిన ‘జీవితం ఒక ఉత్సవం’ బతుకు కథ పుస్తకాన్ని ఆయన వైవాహిక స్వర్ణోత్సవం సందర్భంగా ఎమ్మెస్కో విజయ్ కుమార్ ఆదివారం దస్పల్లా హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అట్టహాసంగా ఆవిష్కరించారు. ఐంద్రజాలికుడిగా, హిప్నాటిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మానవ సంబంధాల కౌన్సెలర్‌గా, ప్రజాప్రతినిధులకు కమ్యూనికేషన్ గురువుగా పట్టాభిరాం తెలుగువారి కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేశారన్నారు.
నిర్వేదంలో ఉన్న యువతను కాపాడి, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి జాతీయ స్థాయిలో ప్రామాణికత కలిగిన రిలేషన్షిప్ కౌన్సెలర్‌గా గుర్తింపు పొందారని కొనియాడారు. తెలుగు జాతి గౌరవాన్ని పట్టాభిరాం ఇనుమడింపజేశారని ప్రముఖులు ప్రసంశించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సోమయాజులు, సినీ నటులు రాజేంద్రప్రసాద్, సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, డాక్టర్ కేవీపీ రాంచందర్ రావు, మాజీ సీఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవీఆర్ కృష్ణారావు, మాజీ మంత్రి బుద్ధప్రసాద్, ఏపీ రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ ప్రసాదరావు, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.