హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి రోజూ ఢిల్లీ నుంచి ఒక కొత్త పిట్ట వచ్చి వాలడం.. లోకల్ పిట్టల కూతలను ప్రాక్టీస్ చేసి మరీ.. అవే కూతలు కూసిపోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. నిజమో అబద్ధమో తెలుసుకోనక్కరలేదు.. వాస్తవాలను బేరీజు వేసుకోనక్కరలేదు. ఏ ఊరికొస్తే.. ఆ ఊరికి సంబంధించిన విషయాన్ని తలకెత్తుకోవాలె.. నోటికొచ్చినట్టల్లా వాగాలె.. బట్టకాల్చి మీద పారేయాలె.. చెయ్యాల్సిన బద్నాం అంతా చేయాలె.. అది తప్పని తేలితే నోరుమూసుకోవాలె.. నిజం కంటె.. అబద్ధం చాలా వేగంగా వ్యాపిస్తుందట.. ఇప్పుడు బీజేపీ నేతలు సరిగ్గా అనుసరిస్తున్న.. పక్కాగా అమలుచేస్తున్న సూత్రం ఇదే.. తాజాగా రాష్ర్టానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ వ్యాఖ్యలు ఇందుకు తార్కాణం.. తాను ఏ హోదాలో ఉన్నదీ.. ఏం మాట్లాడుతున్నదీ అన్న సోయి లేకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడి వెళ్లిపోయారు.. తెలంగాణపై ఆయన చేసిన ఆరోపణలు వింటే.. నవ్వాలో.. ఏడువాలో కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావడంలేదు.ప్రహ్లాద్‌సింగ్ ఆరోపణ: కృష్ణాజలాల్లో 299 టీఎంసీలు చాలు అని తెలంగాణ అంగీకరించడం తప్పు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్లే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
వాస్తవం: కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ కోసం మొదటగా బచావత్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పాటైంది. 1976లో అవార్డును ప్రకటించింది. దా ని ప్రకారం ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు వాటా దక్కింది. గోదావరి జలాల్లో 1,458 టీఎంసీలను కేటాయించారు. అప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయింపులపై వాదించుకొనే హక్కు లేదు. జలాల పునఃపంపిణీ కోసం 2004లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేశారు. అది 2013 లో అవార్డులను ప్రకటించగా, ఉమ్మడి ఏపీకి 1,001 టీఎంసీల వాటా దక్కింది. ఇక్కడా ప్రత్యేకంగా తెలంగాణకు వాటా కేటాయించలేదు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతున్నందున బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డులు అమలులోకి రాలేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులే కొనసాగుతున్నాయి.
ఎటుచూసినా తెలంగాణకు ఎక్కడా ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు. దీంతో ఏపీ విభజన అనంతరం ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగేదాకా తాత్కాలిక ఒప్పందంతో నీటిని పంచుకోవాలని కేంద్రం సూచించింది. అందులో భాగంగానే కృష్ణా జలాల పంపిణీ కోసం ఏపీ, తెలంగాణ మధ్య 2015-16 సంవత్సరానికి మాత్రమే వర్తించేలా తాత్కాలిక ఒప్పందం జరిగింది. అది కూడా ఉమ్మడి ఏపీలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు వాడుకొన్న 66:34 నిష్పత్తి ప్రకారం. ఏడాది తరువాత ఒప్పందం ముగిసిపోతుందని, కోర్టులకు వెళ్లే హక్కు ఏ రాష్ర్టానికీ లేదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన 66:34 నిష్పత్తిని పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం 2018 నుంచి డిమాండ్ చేస్తున్నది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యేదాకా 50:50 నిష్పత్తిలో పంచాలని కోరింది. దీనిని కేంద్రం పెడచెవిన పెట్టి తాత్కాలిక ఒప్పందాన్నే పొడిగిస్తూ వస్తున్నది. ట్రిబ్యునల్ ఏర్పాటుచేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణపైనే నిందలు వేస్తున్నది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే తెలంగాణకు 70.8 శాతం, అంటే 575 టీఎంసీల నీటికి అడిగే అవకాశముంటుందని, వెంటనే ఆ పని చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రహ్లాద్ సింగ్ ఆరోపణ: డీపీఆర్ సమర్పించకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమంటున్నారు? ఎలా సాధ్యం?
వాస్తవం: కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లోని షరతుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి బేసిన్‌కు సంబంధించి 6 ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి గత సెప్టెంబర్‌లోనే సమర్పించింది. ఇప్పటివరకు ఒక్కదానికి కూడా ఆమోదం తెలపలేదు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణకు ప్రధానంగా సీడబ్ల్యూసీ నిబంధనలే అడ్డంకిగా మారాయి. నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వాలనే నిబంధన ఉన్నది. కృష్ణా నదీపై తెలంగాణ, ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కువగా వరద జలాల ఆధారితమే. వాటికి అనుమతులు రావాలంటే ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగేదాక వేచి చూడాలి. ఈ నేపథ్యంలోనే సీడబ్ల్యూసీ నిబంధనలు సడలించాలని తెలంగాణ సర్కారు కేంద్రాన్ని అనేకసార్లు కోరింది. దానిపై ఇప్పటివరకు కేంద్రం స్పష్టతనివ్వలేదు. ఇప్పుడు డీపీఆర్‌లు సమర్పించడం లేదని నిందలు వేస్తున్నదని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో అవార్డులను ప్రకటించినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఎప్పుడు కేంద్రం నోటిఫై చేస్తుందనేదానిపైనా స్పష్టత లేదు. ఫలితంగా కృష్ణా ప్రాజెక్టులు అటకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తెలంగాణ సాగునీటి ఇంజినీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు.