Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యన్ ప్రైవేట్ ఆర్మీలో చెరలో 8 నెలలపాటు బానిస బతుకు బతికిన నారాయణపేట జిల్లావాసి సూఫియాన్ (22)కు విముక్తి లభించింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో ఆయన ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నాడు. సూఫియాన్లా భారత్ నుంచి వెళ్లి దాదాపు 60 మంది మోసపోయినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. విదేశీ కొలువుల పేరుతో నిరుడు డిసెంబర్లో వారిని భారత్ నుంచి తీసుకెళ్లి అక్కడి భద్రతా సిబ్బందికి వ్యక్తిగత సహాయకులుగా నియమించారు. తర్వా త అక్కడ పరిస్థితులు దారుణంగా మారడంతో వారిని రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు ప్రాం తాల్లో బంకర్లు, కందకాలు, ప్రమాదకరమైన ఆయుధాల నిర్వహణకు, ఇతర కఠినమైన పనులకు ఉపయోగించారు.
దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన సూఫియాన్ తమ దైన్యస్థితిని వివరిస్తూ 8 నెలల క్రితం పంపిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చివరికి ఈ వీడియో కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో తామంతా మళ్లీ భారత్కు తిరిగి రాగలిగామని, బాధితుల్లో తెలంగాణతోపాటు కర్ణాటకకు చెందినవారు కూడా ఉన్నారని శంషాబాద్ ఎయిర్పోర్టులో సూఫియా న్ వివరించాడు. ఇన్నాళ్లూ రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో సమయానికి తిండి, నిద్ర లేకుండా రోజుకు 15 గంటలకుపైగా విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని తెలిపాడు.