హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ఆపరేషన్ స్మైల్ 9’ కార్యక్రమం ద్వారా 2,814మంది పిల్లలకు విముక్తి లభించింది. బాల కార్మికులు, తప్పిపోయిన, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. దీనికింద గత జనవరిలో 2,467మంది పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చగా, రెస్కూహోమ్కు 347 మంది పిల్లలను తరలించినట్టు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. గత జనవరి 1నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టారు. మొత్తం 753 మంది పోలీసు లు.. మహిళా శిశు సంక్షేమశాఖ, శిశు సంక్షే మ కమిటీలు, జిల్లాల బాలల సంరక్షణ యూనిట్లు, ఆయా ఎన్జీవోల సాయంతో 2,814 మంది పిల్లలను రక్షించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 872 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వివిధ సెక్షన్ల కింద 391 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, 403 మంది నిందితులను అరెస్ట్ చేశారు.