యాచారం, అక్టోబర్ 4 : ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీకి ఉత్తరాలు రాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఫార్మా బాధిత రైతులు కాంగ్రెస్ అధిష్ఠానానికి శుక్రవారం కూడా లేఖలు రాశారు. ఒకే రోజు ఏకంగా 100 పోస్టుకార్డులు రాసి పోస్టు చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీని రద్దు చేసి పొలాలను తిరిగి రైతులకే ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరిచేవరకు ఉత్తరాల ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.