హైదరాబాద్/ నిజామాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రపంచబ్యాంక్ ప్రభుత్వాలకు అప్పులిస్తుందే తప్ప, వ్యక్తులకు లోన్లు ఇవ్వదని ఏ స్కూల్ విద్యార్థిని అడిగినా చెప్తారు. కానీ ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మాత్రం ఆ విషయం తెలిసినట్టు లేదు. తన నియోజకవర్గంలో వరదసాయానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరుతూ ఆయన ఏకంగా ప్రపంచబ్యాంకుకే లేఖ రాశారు. తన లెటర్‌హెడ్‌పై రాసిన లేఖను మదన్మోహన్ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టుచేయగా.. క్షణాల్లో అది వైరల్‌గా మారింది. రూ.100 కోట్లు సాయం కావాలని కోరుతూ వరల్డ్‌బ్యాంక్ అనుబంధ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ (జీఎఫ్డీఆర్ఆర్)కు ఆయన లేఖ రాయడంపై సొంత పార్టీ కార్యకర్తలే విస్తుపోతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థ అధిపతి కూడా అయిన ఆయనకు కనీస అవగాహన లేకపోవడంపై సోషల్‌మీడియాలో జోకులు పే లుతున్నాయి. ఆయన తెలియక ప్రపంచబ్యాంకును అప్పు అడిగారా? లేక రేవంత్ సర్కారు ఎలాగూ వరదసా యం అందివ్వదని తెలిసీ అడిగారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మదన్మోహన్ కూడా కాంగ్రెస్ ప్రతిభావంతుల జాబితాలో చేరినట్టేనని నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు.