హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : మినీ భారతంలాంటి హైదరాబాద్ తాగునీటి సరఫరాకు శాశ్వత పరిష్కారమైన సుంకిశాల పథకంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఫిర్యాదుకు ఒడిగట్టింది. ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. కాగా జల వివాదాలపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చకు బోర్డు నిరాకరించింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సుంకిశాల పథకానికి రూపకల్పన చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 510 అడుగుల కంటే తక్కువకు పడిపోయిన ప్రతిసారీ నగర నీటి సరఫరా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీంతో శాశ్వత పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టి… 70-80 శాతం పనులు పూర్తి చేసింది.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కృష్ణాజలాలు అత్యంత కీలకం. హైదరాబాద్‌లో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో సగంవరకు దాదాపు ఈ జలాలే ఉంటాయి. నల్లగొండ జిల్లా నుంచి మూడు పైపులైన్ల ద్వారా రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల (ఏటా 16.5 టీఎంసీలు) నీటిని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుంకిశాల పథకానికి శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనే నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల గ్రామం వద్ద నాగార్జునసాగర్ జలాశయం ఫోర్‌షోర్ నుంచి నీటిని సేకరించేందుకు అక్కడ భూసేకరణ కూడా పూర్తి చేశారు. కానీ పలు కారణాలతో పథకం పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత చంద్రబాబు హయాంలో సుంకిశాలను పక్కనపెట్టి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి కృష్ణాజలాలను సేకరించి హైదరాబాద్‌కు అందించారు. అప్పటికే జంట జలాశయాలు, సింగూరు-మంజీరా నుంచి నీటి సరఫరా జరుగుతున్నా పెరిగిన జనాభాకు అనుగుణంగా అవసరాలు తీర్చలేకపోయాయి. ఈ సమయంలో కృష్ణాజలాల సరఫరాతో నగర నీటి అవసరాలు తీరాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి.. శుద్ధి చేసిన తర్వాత నగరానికి సరఫరా చేస్తారు. అయితే నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగులు, అంతకంటే ఎక్కువ నీటిమట్టం ఉంటేనే మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్లు సాఫీగా నడుస్తాయి. ఇలా కాకుండా నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజీ నుంచి కూడా సుంకిశాల ద్వారా నీటిని తీసుకోవచ్చు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం మహానగర నీటి సరఫరాకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ పథకాన్ని మొదలుపెట్టింది. నిర్ణీత గడువు మేరకు ఇప్పటికే పథకం అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ సర్కారు పర్యవేక్షణలోపం, నిర్మాణ సంస్థ మేఘా తప్పిదంతో రిటెయినింగ్ వాల్ కుప్పకూలి పనులు నిలిచిపోయాయి.
కృష్ణాబోర్డు సమావేశం మంగళవారం జరిగిన సమయంలో ఈ అంశాన్ని ఏపీ ప్రస్తావించింది. ఇంతకుముందే గత నెల రెండున సుంకిశాల అంశాన్ని ఎజెండాలో చేర్చాలని కోరుతూ ఏపీ ప్రత్యేక ప్రధానకార్యదర్శి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే సుంకిశాల పనులు కొనసాగిస్తున్నారని, దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ నీటి వాటాపై ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. తగిన అనుమతులు వచ్చే వరకూ సుంకిశాల పనులు నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల కిందటనే సుంకిశాల పథకాన్ని రూపొందించారు. అయినప్పటికీ ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకంపై ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ తాగునీటి కోసం ఇప్పటికే ఏటా 16.5 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని, సుంకిశాల పథకం ద్వారా అదనంగా మరో 20 టీఎంసీలు తరలించనున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి సుంకిశాల పథకం మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి కాకుండా నేరుగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని సేకరించే ప్రత్యామ్నాయ, శాశ్వత పరిష్కార మార్గం. ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి అధికారులకు తెలియనిది కాదు. సుంకిశాల నుంచి తరలించే నీటిని కూడా ప్రస్తుతం నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఆ మూడు పైపులైన్ల ద్వారానే తరలించాల్సి ఉంటుంది. అంటే ఏటా 16.5 టీఎంసీల నీటినే తరలించేందుకు అవకాశముంది. కానీ ఇప్పటికిప్పుడు అదనంగా 20 టీఎంసీలను తరలించనున్నారని ఏపీ సర్కారు తన లేఖలో ఆరోపించడం లేని సమస్యను భూతద్దంలో చూపి పథకాన్ని అడ్డుకునేందుకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.