హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పార్బాయిల్డ్ రైస్ అంశం తెలంగాణ సృష్టిస్తు న్న సమస్య అని కేంద్రం వక్రీకరిస్తూ వస్తున్నది. తెలంగాణకు తప్ప దేశంలో ఏ రాష్ర్టానికీ సమ స్య లేదని రాష్ట్రంపై నీలాపనిందలు వేసింది. అదే నిజమైతే ఒడిశా కూడా ఇదే సమస్యపై చాలాకాలంగా ఎందుకు పోరాటం చేస్తున్నది? దీనికి కేంద్రం ఏం సమాధానం చెప్తుంది? అవును! బాయిల్డ్ రైస్ కొనాలని ఆ రాష్ట్రం కూడా డిమాండ్ చేస్తున్నది. తాజాగా, బాయిల్డ్ రైస్‌కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నదని, ఇప్పటికైనా రాష్ర్టాల నుం చి ఎఫ్‌సీఐ ద్వారా ఆ బియ్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని కేం ద్రానికి ఒడిశా రాజ్యసభ సభ్యుడు అమర్ పట్నాయక్ సూచించారు.
ఈ మేరకు మంత్రి పీయూష్ గోయల్‌కు శనివారం లేఖ రాశారు. డిమాండ్ లేదని చెప్తూ కేంద్రం గత రెండు సీజన్ల నుంచి పార్బాయిల్డ్ రైస్‌ను కొనటం లేదని, దీంతో ఒడిశాలో నిల్వలు 11 లక్షల టన్నుల మేర పేరుకుపోయాయని వివరించారు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇదే అంశాన్ని ఒడిశా ఎంపీలు అనేకమార్లు పార్లమెంటులో లేవనెత్తారని, అయినా స్పందన కరువైందని తెలిపారు. ఏటా దేశం నుంచి ఎగుమతులు పెరుగుతుండటమే పార్బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఉన్నదనటానికి నిదర్శనమని లెక్కలతో సహా లేఖలో వివరించారు.
ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బాయిల్డ్ రైస్‌ను కొనాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ బాయిల్డ్ రైస్ కొనాలని ఒడిశా ఎంపీలు పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలకు జత కట్టారు. బియ్యాన్ని బంగాళాఖాతంలో పారబోయాలా? అని రాజ్యసభలో బీజేడీ నేత ప్రసన్నాచార్య కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ కూడా బాయిల్డ్ రైస్ సమస్యను ఎదుర్కొంటున్నాయని వివరించారు. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోవద్దంటూ ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత్ నుంచి పార్బాయిల్డ్ రైస్ ఎగుమతయ్యే దేశాలు
దేశం : విలువ
బెనిన్ : 2,006
టోగో : 1,787
నేపాల్ : 1,158
గినీ : 1,150
కోట్డీవోర్: 1,083 విలువరూ. కోట్లలో
భారత్ నుంచి రైస్ ఎగుమతులు (బాస్మతి కాకుండా) 2020-21లో (ఏప్రిల్-జనవరి)
26,810 కోట్లు : మొత్తం బియ్యం ఎగుమతుల విలువ 23,406
23,406 కోట్లు: 30 దేశాలకు ఎగుమతి చేసే బియ్యం 87.31%