హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాల్లో జోక్యం చేసుకోబోమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి కృష్ణా జిల్లాకు మళ్లించేందుకు 2015లో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీకి చెందిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ దాఖలు చేసిన రిట్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జల వివాదాల్లో కోర్టుల జోక్యానికి వీల్లేదని, అంతర్రాష్ట్ర జల వివాదం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఉన్నదని అదనపు ఏజీ జే రామచందర్‌రావు వాదించారు.