హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : భారత్‌ను కాలుష్యరహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం సూచించారు. ఖనిజ పరిశ్రమల్లో ఎల్ఎన్జీ గ్యాస్ యంత్రాల వినియోగంపై దృష్టి సారించాలని తెలిపారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ సదస్సు (ఫీమీ)లో వారు ప్రసంగించారు. సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఖనిజ పరిశ్రమలు వినియోగించే థర్మల్ విద్యుత్‌ను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని ప్లాటినం గనిలో భారీ యంత్రాల్లో డీజిల్ స్థానంలో హైడ్రోజన్ ఇంధన బ్యాటరీలను వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత మైనింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సింగరేణి సంస్థ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు.
సింగరేణి సంస్థ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల కోసం 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొన్నదని, మరో 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నదని తెలిపారు. 2023-24 కల్లా తనకు అవసరమైన విద్యుత్తును కేవలం సోలార్ ప్లాంట్ల ద్వారానే సమకూర్చుకుంటుందని పేర్కొన్నారు. తద్వారా సింగరేణి సంస్థ 100 శాతం ‘నెట్ జీరో ఎనర్జీ’ లక్ష్యాన్ని సాధించబోతున్నదని తెలిపారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు. ‘ఖనిజ పరిశ్రమల్లో పర్యావరణ చర్యలు’ అనే అంశంపై పలువురు మైనింగ్ నిపుణులు తమ పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఎన్ఎండీసీ చైర్మన్, ఫీమీ అధ్యక్షుడు సుమిత్ దేవ్, ఉపాధ్యక్షుడు శాంతేశ్ గురెడ్డి, సింగరేణి డైరెక్టర్ డీ సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు ఎం సురేశ్, సీహెచ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.