సిద్దిపేట : సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వర స్వామి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పొన్నాల వద్ద ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒకరన్నారు. ఇతడిని బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారు. లింగాయత ధర్మాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు అని మంత్రి తెలిపారు. సిద్దిపేట వచ్చే ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి ఆశీస్సులతో సిద్దిపేటకు వస్తారన్నారు. 12వ శతాబ్దంలోనే కుల రహిత సమాజం కోసం కృషి చేయడంతో పాటు ఆచరణలో అమలు చేసిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.
ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలని, కష్టపడి పని చేసిన వారే జీవితంలో పైకొస్తారని చెప్పిన ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పని చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని మంత్రి తెలిపారు.
ఇటీవలే బసవేశ్వర స్వామి పేరు మీద బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ గా కొత్త ప్రాజెక్టు కట్టబోతున్నాం. కుల, మతాలు ఏవైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మనదని, అందరూ కలిసి మెలసి ఉండాలన్న బసవేశ్వరుడి ఆశయాలను ఆచరణలో పాటిద్దామని మంత్రి పేర్కొన్నారు.