హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తక్కువ మంది ఓటర్లున్నా సమీపంలోనే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. అటవీ, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్ల కోసం 35,655 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 30 మంది నుంచి 300 మంది ఓటర్లు ఉన్నచోట్ల 428 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.