Leopard | మెదక్ : మెదక్ జిల్లాలో చిరుత పులులు ప్రత్యక్షం అయ్యాయి. హవేలిఘన్‌పూర్ మండల పరిధిలోని మెదక్ – ఎల్లారెడ్డి రోడ్డు సమీపంలోని నాగపురం గేట్ వద్ద చిరుత పులి రోడ్డుపై కనిపించిందని వాహనదారులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున ఆ రోడ్డుపై వెళ్తుండగా చిరుత తారసపడిందని తెలిపారు. అయితే వాహనాల లైట్లకు చిరుత కదలకుండా నిశ్చలంగా ఉండిపోయిందన్నారు. కాసేపటికే రోడ్డు పక్కనున్న ఫారెస్టులోకి చిరుత వెళ్లిపోయిందన్నారు. అయితే మరో చిరుత కూడా చెట్ల పొదల్లో ఉండి గాండ్రించిందని వాహనదారులు పేర్కొన్నారు. చెట్ల పొదల్లో ఉన్న చిరుత తమ కంటికి కనిపించలేదన్నారు.
ఇక చిరుత వీడియోను వాహనదారులు హవేలీఘన్పూర్ పోలీసు స్టేషన్ ఎస్ఐ పోచన్నకు పంపించారు. ఎస్ఐ అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. నాగపురం గేట్ వద్దకు చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా.. చిరుత పులి సంచారం గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిరుత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చిరుతల సంచారం నేపథ్యంలో రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుత కదలికలను గమనించి పట్టుకుంటామన్నారు. చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారుల కంట పడిందన్నారు. స్థానికులను అడవిలోకి వెళ్లకుండా అప్రమత్తం చేశామన్నారు. ఈ ప్రాంతంలో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు.