హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ చేపట్టిందని శాసనమండలి సభ్యులు విమర్శించారు. ఇది 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి చెందిన రెండు సవరణ బిల్లులపై శుక్రవారం శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ జీహెచ్ఎంసీ విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ బిల్లుపై ఉభయసభలతో కూడిన సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు.
ప్రజల భవిష్యత్‌తో ఆడుకోవద్దు: ఎమ్మెల్సీ దాసోజు
జీహెచ్ఎంసీ విస్తరణ పేరుతో 1.34 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి హైదరాబాద్ భవిష్యత్తును తేలికగా చూడకూడదని సూచించారు.74వ రాజ్యాంగ సవరణ ఆత్మ, సూత్రాలను పూర్తిగా విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో సవరణలు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా రాత్రికి రాత్రే 20 మున్సిపాలిటీలు, 7మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలితప్రాంతం (యూనియన్ టెరిటరీ)గా మార్చే ప్రయత్నం జరుగుతున్నదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విస్తరణ తొందరపాటే..: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయం తొందరపాటు చర్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు అనుకొని ఉన్న శివారు పంచాయతీలు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల వారికి 20 ఏండ్ల వరకు అందాల్సిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని దూరం చేసినట్టవుతుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైతే పాలనాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయని సభ దృష్టికి తెచ్చారు. విలీనం కంటే ముందే స్పెషల్ ఎకనామిక్ జోన్లను గుర్తిం చి, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 మున్సిపాలిటీలను అదే విధంగా చేశారని గుర్తుచేశారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ తిరోగమనం చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
డివిజన్ల విభజన హేతుబద్ధంగా జరగాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రాంతాల్లో రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీసీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. డివిజ న్ల విభజనలో హేతబద్ధత పాటించాలని కోరారు. శివారు ప్రాంతా ల్లో నివసించే ప్రజలకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రపంచంతో పోటీపై వాస్తవంలోకి రండి: డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడుతున్నట్టు చెబుతున్నదని, కానీ వాస్తవంలో కనిపించడం లేదని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి డాటా డాక్యుమెంటేషన్ లేకుండా జీహెచ్ఎంసీ విస్తరణ బిల్లు తేవడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన పోలీస్ కమిషనరేట్లతో సికింద్రాబాద్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ప్రపంచమంతా పట్టణీకరణకు వ్యతిరేకంగా ‘రూరల్ హబ్’లు ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.