హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. మండలికి కొత్తగా ఎన్నికైన మహేశ్‌కుమార్‌గౌడ్, తీన్మార్ మల్లన్నను సభ్యులకు చైర్మన్ పరిచయం చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. గంధమల్ల రిజర్వాయర్ పనులపై సభ్యులు జీవన్‌రెడ్డి, నవీన్‌కుమార్, నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానమిచ్చారు. గృహజ్యోతిపై జీవన్‌రెడ్డి, తాతా మధు ప్రశ్నలకు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై సభ్యులు వాణీదేవి, జీవన్‌రెడ్డి, సారయ్య, రఘోత్తమ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానమిచ్చారు.
రైతు భరోసా పథకంపై వాణీదేవి, షేరి సుభాష్‌రెడ్డి, తాతామధు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల సలహాలు, సూచనలు తీసుకొని రైతు భరోసాను పటిష్టంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారెంటీల అమలుపై వాణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కచ్చితంగా అమలు చేస్తామని, ప్రస్తుత రేషన్‌కార్డులను కొనసాగిస్తూనే అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తూ జీరో బిల్లులు ఇస్తున్నామని విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. సభ్యులు మహేశ్‌కుమార్ గౌడ్, వెంకట్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఉద్యోగుల డీఏల బకాయిలపై వాణీదేవి అడిగిన ప్రశ్నకు మంత్రి భట్టి సమాధానమిస్తూ త్వరలోనే డీఏ చెల్లిస్తామని చెప్పారు. మండలి మాజీ సభ్యుడు డీ శ్రీనివాస్ మృతిపై చైర్మన్ సంతాప తీర్మానాన్ని ప్రకటించగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.
ఇద్దరు ప్యానెల్ చైర్మన్ల నియామకం
శాసనమండలిలో ఇద్దరు ప్యానెల్ చైర్మన్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, అల్గుబెల్లి నర్సిరెడ్డిని నియమించినట్టు చెప్పారు.
చెంచులను తరలించద్దు: గోరటి వెంకన్న
నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచులను బలవంతంగా తరలించే ప్రయ త్నం చేయవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. యురేనియం తవ్వకాల పేరుతో నల్లమలలో చెంచుల బలవంతపు తరలింపుతో వారిలో భయాందోళన నెలకొన్నదని చెప్పారు. గతంలో నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్రం నిర్ణయించగా, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తల ఆందోళనలతో విరమించుకున్నదని గుర్తుచేశారు.
వయోపరిమితి పెంచాలి : నర్సిరెడ్డి
అధ్యాపకుల కొరతతో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ప్రమాణాలు పడిపోతున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో 60 శాతం ఖాళీలున్నాయని, ప్రొఫెసర్ల వయోపరిమితిని పెంచి పరిశోధనలను ప్రోత్సహించాలని కోరారు.
చేనేత కార్మికులను ఆదుకోవాలి: ఎల్.రమణ
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ సభ్యుడు ఎల్.రమణ కోరారు. జనవరి నుంచి జూలై వరకు 13 మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో చేనేత కార్మికుల జీవనోపాధికి కల్పించిన పథకాలను నిలిపివేయడంతో చేనేత కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు.
యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 చేపట్టాలి : తీన్మార్ మల్లన్న
గ్రూప్ -1 మెయిన్స్‌లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశమున్నదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు.
రైతుబంధు తరహాలో వేయాలి: రఘోత్తం
రైతుబంధు తరహాలోనే రైతు భరోసా అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి కోరారు. వ్యవసాయ భూములున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా వర్తించదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నదని చెప్పారు. పాతపద్ధతిలోనే రైతు భరోసా అమలు చేయాలని కోరారు.
ప్రొటోకాల్ పాటించకుంటే సెక్యూరిటీని వాపస్ చేస్తా : శేరి
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి చెప్పారు. బ్యూరోక్రాట్లు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలకు ప్రొటోకాల్ కల్పిస్తున్న ఎయిర్‌పోర్టు యాజమాన్యం రాష్ట్ర ప్రజాప్రతినిధుల పట్ల కనీస మర్యాద పాటించడంలేదని విమర్శించారు. జిల్లా, నియోజకవర్గాల్లోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తన సెక్యూరిటీని తిరిగిచ్చేస్తానని తెలిపారు.