Secretariat | ఖైరతాబాద్, ఏప్రిల్ 3 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం నిలిపివేయాలని, విద్యార్థులపై దాడులు, లాఠీచార్జిలు, అరెస్టులు ఆపాలని, ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ఇచ్చిన ఆప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా అమరవీరుల స్థూపం నుంచి సచివాలయం వైపునకు భారీ ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని తోసుకుంటూ సచివాలయం ముట్టడికి యత్నించగా, పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. అరెస్టు చేసిన విద్యార్థులను బేగంబజార్, కంచన్‌బాగ్, గోషామహల్, రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్, సహాయ కార్యదర్శులు ప్రశాంత్, అశోక్ రెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, మహేశ్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తుందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వారికి కట్టబెట్టే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కంచ గచ్చిబౌలిలో ఆర్థరాత్రి బుల్డోజర్లతో చెట్లను నరికివేస్తోందని, ఫలితంగా ఎన్నో వ్యనప్రాణులు మరణిస్తున్నాయన్నారు. జేసీబీలు, బుల్డోజర్లను అడ్డుకుంటున్న విద్యార్థులపై అమానుషంగా లాఠీ చార్జీలు చేస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ చర్యలు దారుణమని, విద్యార్థులకు చదువులు చెప్పే విశ్వవిద్యాలయాలను పోలీసుల చేత నిర్భందించడం అప్రజాస్వామికమన్నారు. తక్షణమే వీసీ జారీ చేసిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో ప్రభుత్వ దమనకాండ ఆపకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లెనిన్, తారాసింగ్, లిఖిత్, ఎఐఎస్ఎఫ్ నాయకులు గ్యార నరేశ్, చైతన్య, పీడీఎస్‌యూ విజృంభన నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.