ములుగు, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సెలవు ఇవ్వట్లేదని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ అదే బెటాలియన్‌కు చెందిన ఎస్సైపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో, ఎస్సై అక్కడికక్కడే మృతిచెందగా హెడ్‌కానిస్టేబుల్ సైతం కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకొన్నది. వెంకటాపురం (నూగూరు) పోలీస్ స్టేషన్లో ఉదయం 8:30 గంటలకు సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ స్టీఫెన్ అదే బెటాలియన్‌కు చెందిన ఎస్సై ఉమేశ్చందర్పై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఎస్సై ఉమేష్‌చంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు.
ఎస్సై మృతిచెందిన అనంతరం స్టీఫెన్ సైతం తలపై కాల్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి జవాన్లు స్టీఫెన్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాల్పుల ఘటనపై సెంట్రల్ సౌత్ జోన్ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా విచారణ చేపట్టారు.