Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో పార్టీ తెలంగాణ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇటీవల గాంధీ భవన్ వేదికగానే పలు జిల్లాల నేతలు ధర్నాలు చేయడం, తన్నుకోవడంపై ఆయన చాలా సీరియస్ అయినట్టు సమాచారం.
ఇంత జరుగుతుంటే ఇక్కడి నాయకత్వం ఏం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు ఎందుకు మీడియాకు లీకులు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో ఎందుకు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. నేతలు తమ మధ్య పోరుతో రోడ్డెక్కుతూ పార్టీ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నేతలంతా స్వీయ నిగ్రహాన్ని పాటించాలని, పార్టీకి వ్యతిరేకంగా మీడియాకు వెళ్లొద్దని, పార్టీకి నష్టం చేయొద్దని మల్లికార్జునఖర్గే సూచించినట్టు పేర్కొన్నాయి.