హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి రేపుతున్నది. క్యాబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చోటు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న లంబాడీ ఎమ్మెల్యేలు మంగళవారం రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. సమావేశంలో పలువురు లంబాడీ ప్రజాప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు కూడా పాల్గొన్నట్టు సమాచారం. క్యాబినెట్ విస్తరణలో తమకు అన్యాయం జరిగిన నేపథ్యంలో బంజారాల ఆత్మగౌరవ సభ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
మంత్రి పదవి కేటాయించేవరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 50 ఏండ్లుగా ప్రతి ప్రభుత్వంలో తమకు మంత్రి పదవి ఉండేదని లంబాడీ ఎమ్మెల్యేలు గుర్తుచేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్కు ఓటు వేసినప్పటికీ, తమకు అన్యాయం జరుగుతున్నదన్న ఆవేదన లంబాడీ సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్నది. మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలపై బంజారా సంఘాల నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.