హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ) నేతలు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. శనివారం మంత్రితో భేటీ అయిన యూనియన్ ప్రతినిధి బృందం సీపీఎస్ రద్దుతో ఒనగూరే ప్రయోజనాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా పాత పెన్షన్ అమలు చేస్తున్న రాష్ర్టాల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు.
నేషనల్ పెన్షన్ ట్రస్ట్‌లో (ఎన్పీఎస్) 2004 నుం చి ఇప్పటివరకు జమైన రూ.16,500 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ, ఉద్యోగుల సొమ్ము వివరాలను సమర్పించారు. పాత పెన్షన్ అమలుతో ఏటా రూ.2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతుందని వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్‌గౌడ్, నరేందర్‌రావు, హాజీ తదితరులు పాల్గొన్నారు.