శివ్వంపేట, నవంబర్ 26: బీఆర్ఎస్ పార్టీని ఎదురుకునే సత్తా లేక, ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. తెరవెనుక చీకటి రాజకీయాలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామంలో ఆదివారం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రచారం చేశారు. దంతాన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు భయం పుట్టుకున్నది.
ఆదివారం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని ఇంటింటికి తిరుగుతూ ప్రజలను వేడుకున్నారు. ఈ తతంగం అంత చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిన్న మొన్నటి వరకు వారివారి అభ్యర్థులకు వేర్వేరుగా తిరుగుతూ ప్రచారం చేసినవారు.. నేడు ఒక్కటై ప్రచారం చేయడంతో ప్రజలు ఈసడించుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని దంతాన్పల్లి గ్రామంలో నిరూపితమైంది. రెండు జాతీయ పార్టీల కలయిక నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.