హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : “అసలే రియల్ మార్కెట్ పడిపోయింది.. మీకిచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు.. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు.. అందులో నుంచే గ్రీన్‌ఫీల్డ్ వేస్తున్నారు.. ఇప్పుడైతే ఎంతోకొంత దక్కుతుంది! లేకపోతే మీ చేతుల్లో పట్టాలు తప్ప ఏమీ మిగలదు” ఇదీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో ఫార్మా రైతులకు పరిహారంగా వచ్చిన ప్లాట్లను అగ్గువకు కొల్లగొట్టేందుకు రైతుల్లో కాంగ్రెస్ నేతలు సృష్టించిన భయాందోళనల తీరు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టాల పంపిణీని పండుగలా జరుపుకొన్న రైతులు.. ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసి, ప్లాట్లు అప్పగిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. వారి ఆశ నెరవేరకపోగా, అందులో నుంచే గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం కొందరు కాంగ్రెస్ నేతలకు కలిసొచ్చింది. అందుకే భారీ ఎత్తున ఫార్మా గ్రామాల్లో అనధికారికంగా ప్లాట్ల కొనుగోలు ప్రక్రియ చేపట్టారనే సమాచారం వెలుగులోకి వస్తున్నది.
ముఖ్యంగా ఇందులో పలువురు బడా నేతల ప్రమేయం ఉన్నదనే ఆసక్తికర అంశం తాజాగా రైతుల నోటి నుంచి వచ్చింది. కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి నేతలు పలువురు బినామీలతో పదుల సంఖ్యలో ప్లాట్లను కొనుగోలు చేసి వేలాది చదరపు గజాల భూమిని హస్తగతం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ‘రైతుల పరిహారం.. నేతల ఫలహారం’ శీర్షిక పేరిట నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనంగా మారింది. ఫార్మా గ్రామాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. దీంతో అనధికారిక ఒప్పందాలు చేసుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది. కొందరు న్యాయవాదులకు ఫోన్‌చేసి నోటరీ చేయించాం కదా, మున్ముందు ఏమైనా ఇబ్బందులొస్తాయా? అని ఆరా తీస్తున్నారు. ఫార్మా రైతులకు పరిహారంగా ఇచ్చిన ఇండ్లస్థలాలను అగ్గువకే కాంగ్రెస్ నేతలు కొల్లగొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా రిజిస్ట్రేషన్లు చేసి, ప్లాట్లను అప్పగించకపోవడం వల్లే అమాయక రైతులు అగ్గువకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైన ‘నమస్తే తెలంగాణ’ కథనంతో రెవెన్యూ అధికారుల్లోనూ కదలిక వచ్చింది. రైతుల ప్లాట్ల అనధికారిక కొనుగోళ్లపై ఆరా తీశారు. వాస్తవానికి రైతుల పేరిట రిజిస్ట్రేషన్లు పూర్తయి, ప్లాట్ల అప్పగింత జరిగితే బహిరంగ మార్కెట్ ప్రకారం చదరపు గజం రూ.30 వేలు పలుకుతుందని, ప్రభుత్వం పరిహారంగా ఇచ్చినందున వారికి వాటిని అమ్ముకునే అధికారం ఉంటుందని తెలిపారు. అందుకే రైతులు తొందరపడి ప్లాట్లను అమ్ముకోవద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు. మరి ప్లాట్లను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి, అప్పగించడం లేదనే దానిపై రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నదని, జిల్లా కలెక్టర్ సైతం ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అర్ధాంతరంగా రైతులకు ప్లాట్లను అప్పగించే ప్రక్రియ మూలన పడిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కాంగ్రెస్ నేతలు బకాసురుడితో పోటీపడుతూ తెలంగాణ భూముల్ని బుక్కపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని విమర్శించారు. పంచభూతాలను కూడా దోచుకునే కాంగ్రెస్ నేతలు, రాష్ర్టాభివృద్ధి కోసం భూములిచ్చిన రైతన్నలనూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి భూములను తిరిగి రైతులకే ఇస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అది మరిచిపోయిందని ధ్వజమెత్తారు. 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలన్న నాడు కేసీఆర్ సత్సంకల్పానికి మద్దతుగా రైతులకు తమ ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం ఇచ్చిందని తెలిపారు. అహంకారంతో ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రైతుల ప్లాట్లు ఫలహారంగా మారడం ఆవేదన కలిగిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే భూములు తిరిగిస్తామన్న రేవంత్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలను కూడా కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంగ్రెస్ నేతల నుంచి ప్లాట్లను తిరిగి రైతులకే అప్పగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.