హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం పట్ల ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా తదితర సంఘాల నేతలు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నాంపల్లిలోని టీజీవో కార్యాలయం వద్ద కుట్రదారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కుట్రదారులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇంచార్జి డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి వినతిపపత్రం సమర్పించారు. మూడ్రోజులపాటు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ మమత, సత్యనారాయణ, ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, పలు సంఘాల నేతలు పీ రవీందర్‌కుమార్, రామినేని శ్రీనివాస్‌రావు, ఎంబీ కృష్ణాయాదవ్, ముజీబ్ హుస్సేని, జీ వెంకటేశ్వర్లు, సహదేవ్, నోరి శ్రీనేశ్‌కుమార్ గోపి, శిరీష, స్వరూప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆబారీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు టీ రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డీ అరుణ్‌కుమార్, కోశాధికారి టీ లక్ష్మణ్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, కే శ్రీనివాస్, రాజిరెడ్డి, ఆనంద్‌రావు పాల్గొన్నారు. శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రను నిరసిస్తూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యోగసంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కుట్రదారులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

నాడు ఉద్యమంలో, నేడు మంత్రిగా అంకితభావంతో పనిచేస్తున్న శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం హేయమని టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. రాజకీయంగా అభివృద్ధిలో పోటీపడాలే తప్ప, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, మరో 8 మంది నిందితుల పేర్లను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి ఉద్యోగులమంతా అండగా ఉంటామని చెప్పారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పిరికిపందల చర్య అని టీజీవో అధ్యక్షురాలు వీ మమత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా అభివృద్ధికి అంకితమయ్యారని చెప్పారు. కుట్రలను నిరసిస్తూ మూడ్రోజులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు.
ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిలా నిలుస్తున్న మంత్రి హత్యకు కుట్ర పన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ గ్రూప్- అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హన్మంత్‌నాయక్ పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ నర్సరాజు, ఎం మోహన్నారాయణ డిమాండ్ చేశారు. ఇది అత్యంతనీచమైన చర్య అని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో) రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, నాయకులు నరేశ్, భిక్షపతి, మౌలానా, రామేశ్వర్రావు పేర్కొన్నారు. కొంతమంది రాష్ట్రంలో ఆశాంతిని సృష్టించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రజాజీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి. రాజకీయ ప్రత్యర్థులపై భౌతికదాడులకు పాల్పడాలనుకోవడం గర్హనీయం. మానవత్వంతో సేవ చేయడానికి కులాలు, మతాలు, ఎల్లలు ఉండవు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. జిల్లాలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కలుషితం కాకూడదు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలి.
-వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం దారుణం. కుట్రదారులు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారు? వారితో జితేందర్‌రెడ్డికి సంబంధం ఏమిటి? మాజీ మంత్రి డీకే అరుణకు కిడ్నాప్‌ల గురించి ముందే ఎలా తెలుసు? కేసులో నిజానిజాలు తేలాలంటే డీకే అరుణ, జితేందర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలి. ప్రభుత్వం ఇటువంటి చర్యల్ని సహించదు. దోషులు ఎంతటివారైనా చట్టం ఉపేక్షించదు.
-పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు దుర్మార్గంగా కుట్ర పన్నారు. పిరికిపందల చర్యకు భయపడం. మంత్రికి అండగా ఉంటాం. ప్రశాంత తెలంగాణలో హత్యా రాజకీయాలు చేయడం దుర్మార్గం. ఈ కేసులో నిందితులెవరో, వారికి ఎవరు సహకరించారో ప్రజలు గమనిస్తున్నారు.
-డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం రాక్షస చర్య. ఇటువంటి కుట్రను ఊహించలేదు. ప్రశాంతంగా ఉండే పాలమూరులో ఇటువంటి చర్యలను సహించం. పోలీసులు తొందరగా స్పందించడం వల్లే ఇది బయటపడింది. ఇంత పెద్ద కుట్రకు సహకరించిన బీజేపీ నాయకులు ఇప్పుడేం సమాధానం చెప్తారు. బీహార్‌లో మాదిరిగా హత్యా రాజకీయాలు ఇక్కడ కుదరవు.
-ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలువలతో కూడిన రాజకీయాలకు నిలయమైన తెలంగాణలో ఫ్యాక్షనిజం పోకడలు ఆందోళనకరం. తెలంగాణ సంస్కృతిలో ఇందుకు చోటులేదు. ప్రజాస్వామిక వాదులు దీనిని వ్యతిరేకించాలి. ఇలాంటి సంస్కృతిని మొగ్గలోనే తుంచివేసేలా చర్యలు తీసుకోవాలి. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి.
-చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం దుర్మారం. అమానుషం. రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి చెల్లదు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి కుట్రదారులకు కఠిన శిక్షలు పడేవిధంగా చేయాలి.
-బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
ఉద్యోగులను ఏకం చేసి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ నేతను తుదముట్టించాలని కుట్ర చేసినవారిని కఠినంగా శిక్షించాలి. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి తలెత్తకుండా చూడాలి.
-గోన విష్ణువర్ధన్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రిజిస్ట్రేషన్ ఎంప్లాయీస్ జేఏసీ మాజీ చైర్మన్
స్వశక్తితో ఉద్యమాల ద్వారా ఎదుగుతూ వచ్చిన శ్రీనివాస్‌గౌడ్ ఉన్నతిని ఓర్వలేక హత్య చేయాలని ఆలోచించడం దుర్మార్గం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది తగదు. కుట్రపై లోతుగా విచారణ జరపాలి. కుట్రదారులను కఠినంగా శిక్షించాలి. బీసీ నేతలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.
-14 బీసీ సంఘాల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం
బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం దారుణం. మంత్రి ఎదుగుదలను చూసి ఓర్వలేని అగ్రకుల శక్తులు ఇలాంటి ఆటవిక చర్యలకు దిగినట్టు భావిస్తున్నాం. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. రాజకీయంగా ఎదుర్కోవాలె కానీ హత్యలు చేయించి ఎదగాలనుకోవడం హేయం.
-బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేశ్‌చారి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్కూర్మ, బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ప్రజాపతి (సంయుక్త ప్రకటన)
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం హేయం. శ్రీనివాస్‌గౌడ్ రాజకీయ ఎదుగుదలను చేసి ఓర్వలేకనే ఇలాంటి పిరికిపంద చర్యలకు పూనుకొంటున్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు అదనపు భద్రత కల్పించాలి. కుట్రను ముందే పసిగట్టి కొందరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్‌శాఖకు కృతజ్ఞతలు.
-అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర్రావుగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రపన్నడం దుర్మార్గం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెనుకబడిన పాలమూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడాన్ని ఓర్వలేకనే కుట్ర పన్నారు.
-గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
అంబాల నారాయణగౌడ్