జైపూర్: గో రక్షణ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించింది. సబ్సిడీల కోసం చనిపోయిన ఆవులతో పాటు గోశాలలో లేని గోవులను కూడా నమోదు చేసి రూ.57 కోట్ల మేర నిధులు కొల్లగొట్టినట్లు నివేదికలో ఆరోపించింది. (Dead cows listed for grants) బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గో రక్షణ పథకం కింద గోశాలలోని ఒక ఆవుకు రోజుకు రూ. 40, దూడకు రోజుకు రూ.20 చొప్పున పశుగ్రాసం, తాగు నీరు కోసం నిర్వాహకులకు చెల్లిస్తారు. అయితే పలు గోశాలల నిర్వాహకులు తప్పుడు లెక్కలు, చనిపోయిన ఆవులను కూడా నమోదు చేసి లబ్ధిపొందినట్లు కాగ్ ఆడిట్ పరిశీలనలో తేలింది.
కాగా, రాజస్థాన్‌లోని 38 గోశాలలు వాస్తవ సంఖ్య కంటే సుమారు 1.31 లక్షల పశువులను అదనంగా చూపించాయి. దీనివల్ల రూ. 57.36 కోట్ల అదనపు గ్రాంట్లు విడుదలయ్యాయి. గోశాలలు నిర్వహించే రోజువారీ పశువుల రికార్డులకు, ‘భారత్ పశుధన్ యాప్’లోని సమాచారం మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు ఆడిట్లో తేలింది. ఈ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, సరైన ధృవీకరణ లేకుండానే నిధులు మంజూరు చేసినట్లు బయటపడింది.
మరోవైపు జైపూర్‌తో సహా అనేక ప్రముఖ గోశాలల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు కాగ్ గుర్తించింది. పింజ్రాపోల్ గోశాలకు సుమారు రూ. 1.81 కోట్లు, హింగోనియా గోశాలకు రూ. 1.41 కోట్ల అదనపు నిధులు విడుదలైనట్లు ఆరోపించింది. డీగ్ జిల్లాలోని ‘శ్రీ బ్రజ్ కామద్ సురభి వన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గోశాల’కు అత్యధికంగా రూ.16.36 కోట్ల అదనపు నిధులు, జలోర్ జిల్లా పాత్మేడాలోని ‘శ్రీ గోపాల్ గోవర్ధన్ గోశాల’కు రూ. 10.95 కోట్ల అదనపు గ్రాంట్లు విడుదలైనట్లు కాగ్ నివేదికలో బయటపడింది.
కాగా, కాగ్ ఆడిట్ నివేదికపై గోపాలన్ శాఖ అధికారులు స్పందించారు. 38 గోశాలల నుంచి రూ. 57.36 కోట్లను తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది మే 29 నుంచి సంబంధిత గోశాలలకు నోటీసులు జారీ చేశారు. అయితే గోశాలల నిర్వాహకులు ఈ ఆరోపణలను ఖండించారు. అదనంగా పొందిన నిధులు తిరిగి చెల్లించేందుకు ముందుకు రావడం లేదు.