హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఓరుగల్లు అంటేనే ఒక చరిత్ర అని, తెలంగాణ ఉద్యమానికి అది పురిటిగడ్డ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో సభా వేదికపై నుంచి ఆయన స్వాగతోపన్యాసం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రజతోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన నేల ఇది అని పేర్కొన్నారు. వరంగల్‌లో భారీ బహిరంగ సభలు పెట్టి విజయవంతం చేయడం బీఆర్ఎస్కే సాధ్యమని తెలిపారు. 2003, 2018లో జరిగిన బీఆర్ఎస్ గర్జనల తర్వాత జరుగుతున్న సభ ఇదేనని గుర్తుచేశారు.
చేర్యాల మీదుగా కేసీఆర్ పయనం
చేర్యాల, ఏప్రిల్ 27 : ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన పార్టీ అధినేత కేసీఆర్ తిరుగు ప్రయాణంలో రాత్రి రోడ్డు మార్గం ద్వారా బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో కేసీఆర్ జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండల కేంద్రం మీదుగా నర్మెట్ట, మద్దూరు మండలం లద్నూరు, మద్దూరు మండల కేంద్రం నుంచి చేర్యాల మండలం ముస్త్యాల, చేర్యాల పట్టణం మీదుగా వేచరేణి, కొమురవెల్లి మండల కేంద్రం నుంచి ఐనాపూర్, పోసాన్పల్లి మీదుగా రాత్రి పొద్దుపోయిన తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేర్యాల ప్రాంతంలోని వివిధ మండలాల గుండా వస్తున్నారని విషయం తెలియడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు గ్రామాల్లో రోడ్లపైకి మంగళహారతులతో వచ్చి రెడీగా ఉన్నారు. చేర్యాలకు కేసీఆర్ చేరుకోగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు పేల్చి స్వాగతం పలికారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్తూ ప్రజలను గమనిస్తూ ఆయా గ్రామాల ప్రజలకు అభివాదం తెలియజేస్తూ ప్రయాణించడంతో ప్రజలు ఎంతో సంబురపడ్డారు. కాన్వాయ్‌లో కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం ఉండటంతో కార్యకర్తల్లో మరింత జోష్ నెలకొంది.