Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని అన్నారు. ఇప్పుడు అకస్మా్త్తుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్‌కు ప్రేమ పుట్టిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లపాటు పాలమూరు-రంగారెడ్డిని పడావు పెట్టిందని మండిపడ్డారు.
మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వలేనే సోయి లేదని అన్నారు. 10 శాతం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏడాది సమయం కావాలని అంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు.
మహబూబ్‌నగర్‌ను కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని లక్ష్మారెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే మహబూబ్‌నగర్ అభివృద్ధి జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఉత్తమ్ మాటలు అన్ని ఉత్తవే అని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మాటలపై నమ్మకం లేదని లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.