హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. మూడేండ్లు, ఐదేండ్ల లాతోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25, రూ. వెయ్యి ఆలస్య రుసుముతో మే 5, రూ. రెండువేల ఆలస్య రుసుముతో మే 15, రూ.నాలుగువేల ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. మే 30న హాల్‌టికెట్లు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. జూన్ 6న పరీక్షలు నిర్వహించి, 25న ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల నేపథ్యంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి జేఎన్టీయూ రెండు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. వివరాలకు 74169 23578, 74169 08215 నంబర్లను సంప్రదించవచ్చని ఎప్ఎట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను బోర్డు సోమవారం విడుదల చేసింది. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. 4,88,316 ఫస్టియర్, 5,08,225 సెకండియర్ విద్యార్థుల చొప్పున మొత్తం 9,96,541 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.