హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం ఆమోదించాలని, లేకుంటే రాష్ట్ర బేజేపీ ఎంపీలు రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు, సామాజిక న్యా యం, కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, వీరయ్య, జ్యోతి, రంగారెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుతోపాటు ఆర్డినెన్స్‌ను సమర్థిస్తున్నట్టు తెలిపారు. ఆర్డినెన్స్‌పై న్యాయపరిశీలన పేరుతో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డా రు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేయాలి ; సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లుపై తక్షణమే కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు ఎస్ వెంకటేశ్వరరావు, జేవీ చలపతిరావు విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ స్పందన సహేతుకంగా లేదని విమర్శించారు. న్యాయపరమైన చిక్కుగా రిజర్వేషన్లు 50శాతం మించకూడదే విషయాన్ని అధిగమించడానికి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీసీ సంఘాలు, వ్యక్తులు ఐక్య ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.