హైదరాబాద్,జూలై 23 (నమస్తేతెలంగాణ): ‘కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీకి అడ్డూ అదుపులేదు.. రాష్ట్రంలో తక్షణమే స్కూళ్లలో ఫీజు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి.. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి.. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలి’ అని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్లతో వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారానికి లోయర్‌ట్యాంక్ బండ్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని పరోక్షంగా అమలుచేస్తూ, రాష్ట్ర విద్యారంగాన్ని బీజేపీ చేతిలో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో 2,253 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి వసతి లేదని, 1,500 పాఠశాలలకు పైగా మూత్రశాలలు లేవని, 28 వేలకు పైగా పాఠశాలల్లో కంప్యూటర్లు లేవని తెలిపారు. అరెస్టు అయిన వారిలో పుట్ట లక్ష్మణ్, కసిరెడ్డి మణికంఠరెడ్డి (ఏఐఎస్ఎఫ్), టీ నాగరాజ్, రజనీకాంత్ (ఎస్ఎఫ్ఐ), పొడపంగి నాగరాజు, మొగిలి వెంకట్‌రెడ్డి (పీడీఎస్‌యూ),గడ్డం నాగార్జున, పల్లె మురళి (ఏఐఎఫ్డీఎస్), మనే కుమార్ (ఏఐపీఎస్యూ), నితీశ్ (ఏఐడీఎస్వో) ఉన్నారు.