హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పర్యావరణహితం కోసమే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో బుధవారం 25 ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా బస్సుల ప్రత్యేకతలను వారు పరిశీలించారు. టీఎస్ఆర్టీసీ కష్టాల్లో ఉన్నా, ప్రజలకు రవాణా ఇబ్బందులు రాకుండా నాణ్యమైన సేవలను అందిస్తూనే ఉన్నదని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింతగా పెంచనున్నట్టు తెలిపారు. ప్రైవేట్‌కు దీటు గా టీఎస్ఆర్టీసీ సేవలందిస్తున్నదని చెప్పారు. మెట్రోకు అనుసంధానంగా రవాణా సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలోనే ఒక కార్డుతో అన్నిరకాల ప్రయాణాలు చేయొచ్చని చెప్పారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్‌లో నాలుగు నెలల్లో 475 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తెస్తామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సంస్థ 1,860 ఎలక్ట్రిక్ బస్సులను తేవాలని నిర్ణయించినట్టు వివరించారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు టీఎస్ ఆర్టీసీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉన్న దని ఒలెక్ట్రా సీఎండీ ప్రదీప్‌రావు అన్నారు. ఈ నెల 23 నుంచి ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు నగరంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో వీ రవీందర్, ఈడీలు పురుషోత్తం, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేశ్ ఖాజా, ఇన్ఫోసిస్ నుంచి వెంకటేశ్, వర్చుసా సెంటర్ హెడ్ కృష్ణ ఏదుల, ఒలెక్ట్రా మారెటింగ్ హెడ్ వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.