Congress Govt | హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, విద్యార్థులు ఉద్యమిస్తున్నా రేవంత్ సర్కారు మాత్రం వరుస నోటిఫికేషన్లతో బాధితుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇప్పటికే లగచర్ల, హెచ్‌సీయూతోపాటు పలు ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నోటిఫికేషన్ల జారీ చేస్తున్నది. తాజాగా నిమ్జ్(నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్)కోసం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో 1,456 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
గుంజేటి గ్రామంలో 59 మంది రైతుల నుంచి 286.13ఎకరాలు, మామిడ్గి గ్రామంలో 694 మంది నుంచి 1169.11ఎకరాలు, గణేశ్‌పూర్‌లో 1.06 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదివరకే రైతుల అభిప్రాయాల సేకరణ పూర్తయిందని, ఇంకా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఇటీవలే ప్రభుత్వం న్యాల్కల్ మండలం హుసెల్లి గ్రామ పరిధిలో 491 మంది రైతుల నుంచి 653.08 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా, తాజా నోటిఫికేషన్‌తో ఒక్క న్యాల్కల్ మండలంలోనే 2109.38 ఎకరాల భూసేకరణకు చర్యలు తీసుకున్నట్టు అయ్యింది.
వాస్తవానికి మొదటి నుంచీ రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం బలవంతంగా నోటిఫికేషన్లు జారీచేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్జ్ కోసం భూములు సేకరిస్తున్నారనే కారణంతో ఈ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు భూములు కొనేందుకు ముందుకు రావడంలేదని వారంటున్నారు. దీంతో అనివార్యంగా ప్రభుత్వాని కి భూములు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు గతంలో రూ.4 లక్షల నష్టపరిహారం తీసుకొని భూములు ఇచ్చినవారు సైతం ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి ప్రస్తుత ధరల ప్రకారం నష్టపరిహారం మంజూరవుతున్నట్టు స్థానిక రైతులు చెప్తున్నారు. గత మూడేండ్లలో జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా గరిష్ఠ ధరను పరిగణలోకి తీసుకొని నష్టపరిహారాన్ని ఖరారు చేస్తున్నారని, ఫలితంగా ఎకరానికి రూ.15 లక్షల వరకు పరిహారం వస్తున్నదని పేర్కొంటున్నారు. వాస్తవానికి జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ పరిధిలో లేని ప్రాంతంలో భూముల ధరలు ఎకరాకు రూ.50 లక్షల వరకు పలుకుతున్నప్పటికీ తాము రూ.15లక్షలతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నదని కొందరు రైతులు వాపోతున్నారు.
జహీరాబాద్ నిమ్జ్ కోసం జహీరాబాద్, న్యాలకల్, జరాసంఘం మండలాల పరిధిలో సుమారు 13,500 ఎకరాలు సేకరించానే ప్రతిపాదన ఉండగా, ఇందులో దాదాపు 8 వేల ఎకకాల పైచిలుకు భూముల సేకరణ గతంలోనే పూర్తయింది. మిగిలినచోట్ల కోర్టు కేసులు, రైతుల వ్యతిరేకత, ప్రజాభిప్రాయ సేకరణ తదితర కారణాలతో భూసేకరణ నిలిచిపోయింది. దాదాపు 3వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసి పరిశ్రమలకు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ టీజీఐఐసీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలున్నాయి.