హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయి. నెలాఖరులో ఒక రోజు ముందుగా ఇచ్చిన ఉత్తర్వులతో గందరగోళం నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రొఫెసర్ల వయోపరిమితిని 60 నుంచి 65 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే జీవోపై 28వ తేదీన ఇచ్చినట్టు ప్రచురించారు. అయితే ఈ ఉత్తర్వులు గురువారం విడుదలయ్యాయి. జేఎన్టీయూ, మహత్మాగాంధీ వర్సిటీల్లో పలువురు శుక్రవారమే పదవీ విరమణ పొందాల్సి ఉంది. గురువారం రాత్రి 9గంటలకు ఈ ఉత్తర్వులు బయటికొచ్చాయి. అప్పటికే పలువురు ప్రొఫెసర్లు పదవీ విరమణ సభలను ఏర్పాటు చేసుకున్నారు. జేఎన్టీయూలో సివిల్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ ప్రొఫెసర్ పదవీ విరమణ సభకు ఆయన సన్నిహితులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి జీవో బయటికిరావడంతో రిటైర్మెంట్ సభను నిలిపివేసుకున్నారు. ఓయూలో ముగ్గురు పదవీ విరమణ పొందాల్సి ఉండగా, వయోపరిమితి పెంపుతో సన్మాన సభలను రద్దుచేసుకోవాల్సి వచ్చింది. మరికొందరు సన్మానాలకు బదులు అభినందనలు చెప్పాల్సి వచ్చింది. అయితే జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘన కిందికి రాకుండా జనవరి 30నే జీవో జారీచేసిన జీవోపై 28వ తేదీని ప్రచురించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రిటైర్మెంట్ పెంపు నిరుద్యోగులకు శాపం: బీఆర్ఎస్వీ
రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు పెంచడం భావితరాలకు గొడ్డలిపెట్టని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ విమర్శించారు. 420 రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగుల పాలిట యమపాశంగా మారిందని మండిపడ్డారు. క్యాలెండర్ ఇయర్‌ను అటకెక్కించారని ఆరోపించారు. ప్రొఫెసర్లకు పెంచిన రిటైర్మెంట్ వయస్సును వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు.