మద్యం దుకాణాలకు ఫుల్లు గిరాకీ నెలకొన్నది. రాబోయే రెండేండ్ల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఈ నెల 9వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 18 వరకు వరకు గడువు విధించడంతో శుక్రవారం ఆఖరురోజు టెండర్ వేసేందుకు వ్యాపారులు పెద్దఎత్తున ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చారు. మెదక్ జిల్లాలో 49 దుకాణాలకు 1905 దరఖాస్తులు రాగా, అత్యధికంగా పోతంశెట్పల్లిలో ఉన్న దుకాణం కోసం 104 వచ్చాయి. టెండర్ల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.38.10కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ అధికంగా ఉందని వ్యాపారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 101 మద్యం దుకాణాలకు శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 4716 దరఖాస్తులు రాగా, మొత్తం రూ.94.32 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికాలు తెలిపారు.
– మెదక్ /సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), ఆగస్టు 18
మెదక్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలువగా భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 1905 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ.38.10 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 16 రిజర్వు అయ్యాయి. ఇందులో ఒకటి ఎస్టీ, ఆరు ఎస్సీలకు, 9 గౌడ కులాలకు కేటాయించారు. జిల్లా పరిధిలో మూడు ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా, మెదక్ స్టేషన్ పరిధిలో 17 మద్యం దుకాణాలు, నర్సాపూర్ స్టేషన్ పరిధిలో 17 దుకాణాలు, రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో మెదక్‌లో 17 దుకాణాలకు 750 దరఖాస్తులు, నర్సాపూర్‌లో 17 దుకాణాలకు 654 దరఖాస్తులు, రామాయంపేటలో 15 దుకాణాలకు 500 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మద్యం దుకాణ వార్షిక టర్నోవర్ ట్యాక్స్‌ను పది రేట్లకు పెంచారు.
చివరి రోజు భారీగా దరఖాస్తులు
జిల్లాలో మద్యం దుకాణాలకు ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజు దరఖాస్తుదారులు పెద్దఎత్తున మద్యం టెండర్లకు దరఖాస్తులు చేసుకున్నారు. మద్యం దుకాణాలకు గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా దరఖాస్తులు పెరిగాయి. గతం మాదిరిగా ఎక్కువగా విక్రయాలు ఉండే దుకాణాలు, ప్రాంతాలను టెండర్‌దారులు ముందుగానే గుర్తించి ఆయా దుకాణాలకు భారీగా టెండర్లు దాఖలు చేశారు. రెండేండ్లలో ఏయే ప్రాంతాల్లో దుకాణాలు ఎంత మద్యం విక్రయించాయన్న విషయాన్ని ఆసక్తి గల టెండర్‌దారులు అధికారుల నుంచి ముందుగానే తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో గతేడాది ఏర్పాటైన పోతంశెట్‌పల్లి దుకాణానికి 104 వరకు దరఖాస్తులు వచ్చాయి.
ఎస్సీ, ఎస్టీ, గౌడలకు కేటాయించిన దుకాణాలు ఇవే..
మెదక్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వు స్థానాల్లో దుకాణాలు కేటాయించారు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి షాప్ నంబర్ 1, ఎస్సీలకు మెదక్ మున్సిపాలిటీ నం.5, టేక్మాల్, కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి, నర్సాపూర్ మున్సిపాలిటీ నం.4, చిలిపిచేడ్ మండలం జగ్గంపేట్, రామాయంపేట మున్సిపాలిటీ నం.1, గౌడలకు వడియారం, వెల్దుర్తి నం.2, రామాయంపేట మున్సిపాలిటీ నం.2, కాళ్లకల్, నర్సాపూర్ మున్సిపాలిటీ నం.2, నర్సాపూర్ మున్సిపాలిటీ నం.1, తూప్రాన్ మున్సిపాలిటీ నం.2. కొల్చారం మండలం రంగంపేట్, మెదక్ మండలం మంభోజిపల్లి దుకాణాలు కేటాయించారు.