హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : మూడేండ్లు, ఐదేండ్ల లా, ఎల్ఎఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ -26 నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కానున్నది. 10వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెట్ కమిటీ సమావేశాన్ని మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, వైస్ చైర్మన్ ఈ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్, ఎస్కే మహమూద్ తదితరులు సమావేశంలో పాల్గొని షెడ్యూల్ ఖరారుచేసి విడుదలచేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 13 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను మే 18న మూడు సెషన్లలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం www.lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి సూచించారు.
ఫిబ్రవరి 9 నుంచి ఈసెట్‌కు దరఖాస్తులు
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించే టీజీఈసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 5న విడుదల కానున్నది. 2026-27లో ప్రవేశాలకు అభ్యర్థులు 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ కమిటీ సమావేశాన్ని మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసెట్ షెడ్యూల్‌ను ఖరారుచేసి విడుదల చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.500, జనరల్ అభ్యర్థులు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మే 5న ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.