హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ల్లో ఇప్పటివరకు ఏటా ఆనవాయితీగా అందిస్తూ వచ్చిన నగదు ప్రోత్సాహకాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ ఏడాది ర్యాంక్‌లు సాధించినవారికే కాకుండా, గతేడాది ర్యాంకులు పొందిన విద్యార్థులకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం ప్రభుత్వం పక్కనపెట్టడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. ఎంతో కష్టపడి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో మెడికల్, ఇంజినీరింగ్ సీట్లను సాధించిన నిరుపేద విద్యార్థులు వాటికోసం ఎదురుచూస్తున్నారు.
ఇంటర్‌తోపాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయస్థాయి పరీక్షల్లో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో ప్రత్యేకంగా 20 బాలికలకు, 17 బాలురకు, 1 కోఎడ్యుకేషన్ కలిపి మొత్తం 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) కేంద్రాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వీటిలో బాలికలకు 2000, బాలురకు 1680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివకు వీటి నుంచి దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌తోపాటు నిట్, ఐఐటీల్లో సీట్లు సాధించారు. ఇలా సీట్లు సాధించిన వారికి సొసైటీ ప్రతి సంవత్సరం నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ వస్తున్నది. మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు రూ.50 వేలు, ఇంజినీరింగ్ సీట్లు పొందిన వారికి ల్యాప్‌టాప్‌లు అందిస్తూ వస్తున్నది. గిరిజన విద్యాసంస్థల సొసైటీ ఈ ఏడాది అందుకు సంబంధించిన పురస్కారాలను ఇటీవలే అందజేసింది. సోషల్వెల్ఫేర్ సొసైటీ మాత్రం ఇప్పటికీ ప్రోత్సాహకాలను అందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. గతేడాది సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి 150 మంది మెడికల్ సీట్లు, 130 మంది ఇంజినీరింగ్ సీట్లు సాధించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను గతేడాది అక్టోబర్‌లోనే సిద్ధం చేశారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రోత్సాహకాలను అందివ్వలేదు.
2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది నీట్ అడ్మిషన్లలో ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులు సత్తాచాటి 174 మంది సీట్లను కైవసం చేసుకున్నారు. దాదాపు 130 మంది ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో సీట్లు పొందినట్టు తెలుస్తున్నది. వీరికి ప్రోత్సాహకాలు అందివ్వాల్సి ఉండగా, ఇప్పటికీ ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ప్రతిపాదనలను పక్కనపెట్టడం, ఈ ఏడాదికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహకాలను అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.