హైదరాబాద్, నమస్తే తెలంగాణ 19(నమస్తే తెలంగాణ): అమెరికాలో ఏపీ మహిళ, ఆమె కుమారుడి హత్య కేసు మిస్టరీ వీడింది. 2017లో వీరు దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడిని ఎనిమిదేండ్ల తర్వాత ల్యాప్‌టాప్ ఆధారంగా అమెరికా పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలో నివాసం ఉండేవాడు. అతడికి భార్య శశికళ(40), కుమారుడు అనీష్(7) ఉన్నారు. 2017 మార్చి 23న హనుమంతరావు విధులకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
హనుమంతరావుతో ఎవరికైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సహోద్యోగి నజీర్ హమీద్‌తో భేదాభిప్రాయాలు ఉన్నట్టు గుర్తించారు. హత్య జరిగిన ఆరు నెలలకు హమీద్ భారత్ వచ్చినట్టు తెలుసుకున్నారు.హమీద్ డీఎన్ఏ నమునా కోసం అమెరికా అధికారులు ప్రయత్నించి నా.. అతను తిరస్కరిస్తూ వస్తున్నాడు. దీంతో డీఎన్ఏ సేకరించడానికి హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపాలని అమెరికా కోర్టు 2024లో కాగ్నిజెంట్ కంపెనీని కోరింది. హమీద్ ల్యాప్‌టాప్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఘటనా స్థలంలో లభ్యమైన డీఎన్ఏతో సరిపోయింది. దీంతో హమీద్‌ను నిందితుడిగా అమెరికా ప్రకటించింది.