Bhu Bharati | వీర్నపల్లి, జూన్ 27: సాగుకు యోగ్యం కాని భూములంటూ అసలు భూమినే భూభారతిలోనే కనిపించకుండా చేశారు. అధికారులు చూపిన ఈ అత్యుత్సాహం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు కంచర్ల, బావ్సింగ్తండా, బంజేరు గ్రామాల్లో జరుగగా, తమకు రైతు భరోసా రాకపోవడంతో రైతులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీర్నపల్లి మండల మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా మల్కపేట రిజర్వాయర్ నుంచి నీళ్లను ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసేందుకు రాయిని చెరువు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో 209 మంది రైతులు 15 ఎకరాలు కోల్పోగా వారికి రూ.1.05 కోట్ల పరిహారం అందించింది.
పైప్‌లైన్ పోయే భూమితోపాటు మిగతా దానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమికి రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పైప్‌లైన్, కాల్వపోయే భూమితోపాటు దానికి ఆనుకుని సేద్యం చేసుకుంటున్న భూమికి సైతం రైతు భరోసా నిలిపివేశారు. వీర్నపల్లి, కంచర్ల, బావ్సింగ్నాయక్ తండా, భూక్యా తండా, బంజేరు గ్రామాలకు చెందిన 40 మందికి చెందిన 65 ఎకరాల భూమికి రైతు భరోసా నిలిచినట్టు బాధిత రైతులు తెలిపారు. భూములకు బ్యాంకులోన్లు కూడా రావని తెలిసి, భూభారతిలో భూమినే లేకుండా చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
వ్యవసాయం చేస్తున్న భూ ములను సైతం భూభారతి నుంచి తొలగించడాన్ని ఖండిస్తున్నాం. సేద్యం చేస్తున్న భూ ములను వెంటనే రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై క్లారిటీ ఇవ్వకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. – మల్లారపు అరుణ్,
ప్రజాసంఘాల నాయకుడు
పావు గుంటకు 38 గుంటలు
వీర్నపల్లిలో 38 గుం టల భూమి ఉంది. గతంలో 38 గుంటలకు రైతు భరోసా వచ్చింది. బ్యాంకులోన్ ఇవ్వమని అంటున్నరు. మా భూమి రికార్డులకు ఎక్కిస్తేనే సరి.. లేకపోతే రైతులందరం కలెక్టర్ వద్దకు పోయి తేల్చుకుంటం.
– పిట్టల నాగరాజు, రైతు, వీర్నపల్లి