మొయినాబాద్, డిసెంబర్ 1: యాభై ఏండ్ల క్రితం దళితుల ఉపాధి కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం గుంజుకునే కుట్రలు చేస్తున్నదని, ప్రాణాలు పోయినా తమ భూములను వదులుకునేది లేదని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం వాసులు హెచ్చరించారు.
గ్రామ రెవెన్యూలో సర్వేనంబర్ 218లో యాభై ఏండ్ల క్రితం గ్రామానికి చెందిన 36 మంది కుటుంబాలకు కోళ్ల ఫారాల కోసం కేటాయించిన ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి కుట్రలు చేస్తున్నదంటూ సోమవారం వారు భూముల వద్ద టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. దళితుల కోసం కేటాయించిన భూములను వదిలి మిగిలిన భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము భూములను వదులుకోవడానికి సిద్ధంగాలేమని స్పష్టంచేశారు.