దేవరుప్పుల, మార్చి 29 : బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించలేదనే కారణంతో గిరిజన రైతు భూమిని డీసీసీబీ స్వాధీనం చేసుకున్న వైనం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం శివారు సీత్యాతండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సీత్యాతండాకు చెందిన భూక్యా బిచ్యా తనకున్న నాలుగు ఎకరాల భూమిని జిల్లా సహకారం కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో 2021లో తనఖా పెట్టి రూ. 9,81,400 రుణం తీసుకున్నాడు.
వాయిదాల ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో శనివారం డీసీసీబీ అధికారులు బిచ్యా భూమిని స్వాధీనం చేసుకుని జెండా పాతారు. ఈ సందర్భంగా బ్రాంచి మేనేజర్ సంతోషిమాతా మాట్లాడుతూ బిచ్యా బ్యాంకులో రుణం తీసుకుని వాయిదాలు చెల్లించలేదన్నారు. దీనిపై నోటీసులు పంపినా స్పందించకపోవడంతో భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.