BRS | కరీంనగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నది. ప్రజల కోసం నిత్యం ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నది. అందుకోసం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని తన ప్లాన్‌ను అమలు చేస్తున్నది. ఉన్నతస్థాయి అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకొని, బీఆర్ఎస్ శ్రేణులు, సీనియర్ నాయకులు, కేటీఆర్ అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుల పేరిట వికృత పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఇటీవల అరెస్టయిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొల్లి రామ్మోహన్, మరో నాయకుడు అగ్గిరాములు, జిందం దేవదాస్, సురభి నవీన్‌రావు తదితరుల కేసులను నిశితంగా పరిశీలిస్తే.. అధికార పార్టీతో కలిసి అధికారయంత్రాంగం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు చేశారని, కబ్జాలు చేశారని అబద్ధపు ప్రచారాలు చేయడంతోపాటు తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ అక్రమ కేసులకు తలొగ్గడం లేదు. అధినేత కేటీఆర్ అభయంతో నిజానిజాలను న్యాయస్థానాల్లో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారి పోరాటబాట ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితోపాటు అక్రమ కేసులు పెట్టిన అధికారుల్లోనూ వణుకు పుట్టిస్తున్నది.
నిజానికి ఇటీవల అరెస్టయిన మెజార్టీ నాయకులు చేసిన క్రయ విక్రయాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఆనా డు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జరిగినవే. సిరిసిల్ల కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులపై అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు విసురుతున్న వలలో అధికారులు చిక్కుకుంటున్నారు. ఆయ న చెప్పిందే వేదంగా చట్టాలను ఏమా త్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసులు బనాయిస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్‌పై ముందుగా కేసు పెట్టి ఆరెస్టు చేశా రు. అక్కడితో ప్రారంభమైన కేసుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మరికొంత మం ది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ నాయకుడి చేతిలో ఓ ఉన్నతాధికారి కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. బనాయిస్తున్న కేసులు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. పై అధికారికి భయపడి కిందిస్థాయి అధికారులు తప్పుడు వివరాలు సమర్పిస్తున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఒక కేసు నమోదు చేసే ముందు నిజనిజా లు పరిశీలించాలి. సంబంధిత వ్యక్తికి నోటీసులు ఇవ్వాలి. విచారణ జరిపిన తర్వాత మా త్రమే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలి. కానీ, ఇవేవి లేకుండానే కక్షపూరిత చర్యలకు దిగుతున్నారు. మచ్చుకు ఇటీవల అరెస్టు అయిన బొల్లి రామ్మోహన్ ఉదంతమే అధికారుల కక్ష సాధింపునకు ఓ నిదర్శనం.
మరో తప్పుడు కేసు
అలాగే సర్దాపూర్ పరిధిలోని 27/5 సర్వేనంబర్‌లో ఎకరం 20 గుంటలు అసైన్డ్ భూమి కొనుగోలు చేశారంటూ బొల్లి రామ్మోహన్‌పై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. ఇక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు అవునూరి పితాంబర్రావు అనే వ్యక్తికి 1964-65 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 10.05 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. పితాంబర్రావు చనిపోవడంతో అతని కొడుకు వేణుగోపాల్‌రావుకు సదరు ఆస్తి సంక్రమించింది. ఆయన నుంచి బొమ్మవరం చంద్రశేఖర్‌రావు ఆ భూమిని కొనుగోలు చేశారు. బొమ్మవరం చంద్రశేఖర్‌రావు నుంచి (డాక్యుమెంట్ నంబర్ 2317/09) రామ్మోహన్ 2009లో కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ తరహా అసైన్డ్ భూములను ప్రభుత్వ జీవో ఎంఎస్ నంబర్ రెవెన్యూ (అసైన్డ్-1) తేది 15-12-2008 ప్రకారం పది సంత్సరాల తదుపరి ఎవరికైనా విక్రయించుకోవచ్చని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఉత్తర్వులన్నీ కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, జీవోల ప్రకారమే రామ్మోహన్‌కు సబంధించిన భూము ల లావాదేవీలు, క్రయ విక్రయాలు జరిగాయి. ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా లేదు. ఆక్రమణలు లేవు.
ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఉత్తర్వులు, ఎన్వోసీలున్నాయి. వాటిని అధికారులు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే భూమిలో రామ్మోహన్‌తోపాటు మరో ఐదుగురు మోఖాపై ఉన్నారు. కానీ, వారి భూములను రద్దు చేయలేదు. వారి కి కనీసం నోటీసులు ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ప్రస్తావనను అధికారులు ఎక్క డా చూపలేదు. ఒకే సర్వే నంబర్లో రామ్మోహన్‌ది అక్రమం అయితే.. మిగిలిన వారిది కూడా అక్రమమే అవుతుంది కదా! ఈ లాజిక్‌ను సై తం అధికారులు విస్మరించి కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై రామ్మోహన్ మాట్లాడుతూ.. అధికారులు తప్పుగా పేర్కొంటున్న ప్రతి భూమిని తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నానని, తప్పుడు కేసులు పెట్టినవారితోపాటు తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై న్యాయపరమైన చర్యలకోసం పోరాటం చేస్తానని చెప్పారు. ఓ ఉన్నతాధికారి ఒత్తిడికో లేక కాంగ్రెస్ నాయకుడి ఒత్తిడికో తలొగ్గి అధికారులు తప్పుడు కేసులు పెడితే.. న్యాయపరమైన చర్యలను సదరు అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకుల చేతుల్లోనే అనైన్డ్ భూములు
నిజానికి కాంగ్రెస్ నాయకుల చేతుల్లో వేల ఎకరాల అసైన్డ్ భూములున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నా యకులు వాటికి సంబంధించిన పూర్తి డా టా సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది. అతి త్వరలోనే ఆ నిజాలన్నీ బయట పెట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. 2009 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ నాయకులు భారీగా అసైన్డ్ భూములు ఆక్రమించుకోవడమే కాదు, రికార్డులను తారుమారు చేసి, ఎంచక్కా అనుభవిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మరికొంత మంది అమ్ముకొని, సొమ్ముచేసుకున్నారని తెలుస్తున్నది. అటువంటి వారిని వదిలి పెట్టి, నిజాయితీగా, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన బీఆర్ఎస్ నాయకులపై కక్ష కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ కేసులకు బలైంది కేవలం ఒక రామ్మోహన్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ నాయకుడి ప్రతి ఆరెస్టు వెనుక కక్ష పూరిత చర్యలే కనిపిస్తున్నాయి. ఆ వివరాలను కూడా ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేనున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే క్రయ విక్రయాలు
సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ పరిధిలోని సర్వేనంబర్ 61లో 441 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. సర్వేనంబర్ 61/38లోని ఐదెకరాల స్థలాన్ని వికృతి ప్రభాకర్ ద్వారా.. (డాక్యుమెంట్ నంబర్ (4975/ 07) వినాయక స్టోన్‌క్రషర్ పేరుతో 2007లో బొల్లి రామ్మోహన్ కొనుగోలు చేశారు. వికృతి ప్రభాకర్ ఈ స్థలాన్ని (డాక్యుమెంట్ నంబర్ 4733/ 2007) వే ముల రవీందర్ నుంచి కొనుగోలు చేశారు. నిజానికి వేముల రవీందర్ మాజీ సైనికోద్యోగి. ఆయనకు ప్రభుత్వం సర్వేనంబర్ 61/38లో ఐదు ఎకరాల స్థలాన్ని 1992 లో (ఎమ్మార్వో సిరిసిల్ల ఆర్డీఎస్ 4474/ 92) ద్వారా ఇచ్చింది. నిబంధనల ప్రకారం పదేండ్లు దాటిన తర్వాత ఎక్స్‌సర్వీస్‌మెన్ తమ స్థలాన్ని ఇతరులకు విక్రయించుకోవచ్చు. వేముల రవీందర్ తన భూమిని అమ్మటం కోసం.. ఆనాడు సిరిసిల్ల ఎమ్మా ర్వో నుంచి (రెఫరెన్స్ నంబర్ బి/ 1271/2007 తేదీ: 5-11-2007) ఎన్వోసీ తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రం లో బీఆర్ఎస్ ప్రభుత్వమే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎన్వోసీలు వచ్చాయి. ఆ సమయం లో బీఆర్ఎస్ నాయకుడిగా ఎటువంటి పత్రాలు సృష్టించడానికి ఆస్కారమే లేదు. రవీందర్ నుంచి కొనుగోలుచేసిన స్థలంలో 2007లో కంకర మిషన్ (స్టోన్‌క్రషర్)ను రామ్మోహన్ పెట్టారు.
దీనికి రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీసుల శాఖ నుంచి ఎన్వోసీలున్నాయి. అలాగే ఫ్యాక్టరీ లైసెన్స్ ఉంది. మైన్స్ క్వారీ లీజు సర్టిఫికెట్ ఉంది. పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది. అలాగే నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్ ఉంది. ఇన్ని ఉన్నా ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని, దానిని తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ అధికారులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. భూమిపై ఏదైనా ఫిర్యాదు వస్తే ముందుగా రెవెన్యూ అధికారులు విచారణ చేయాలి. నోటీసులు ఇవ్వాలి. విచారణ పూర్తి అయిన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కేసులో కలెక్టరేట్ ఏవో నేరుగా సిరిసిల్ల టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి ఏవోకు అర్హత ఉండదు. కానీ, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రామ్మోన్కు సిరిసిల్ల ఏవో ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. అంతేకాకుండా ఈ స్థలం అక్రమమంటూ.. ఆన్లైన్ నుంచి ప్రస్తుతం దాని వివరాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆన్లైన్ నుంచి తొలగించే ముందు.. రెవెన్యూ అధికారులు కచ్చితంగా భూ యజమానికి ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇక్కడ ఎటువంటి నిబంధనలను అధికారులు పాటించకపోవడం.. వారి కక్ష సాధింపునకు నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే, ఇదే కేసులో పోలీసులు కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. కానీ, వాళ్లు నిబంధనలను విస్మరించి, వాకింగ్ చేస్తున్న సమయంలో రామ్మోహన్‌ను ఆరెస్టు చేశారు.