బడ్జెట్ అంచనాలో 99% ఆదాయం
2020-21 కంటే 136% అధికం
మొత్తం 19.80 లక్షల లావాదేవీలు
కనిపించని కొవిడ్ సంక్షోభ ప్రభావం
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్‌వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు. ఫలితంగా రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.12,372.73 కోట్ల ఆదాయం వచ్చినట్టు కాగ్‌కు సమర్పించిన నివేదికలో ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో రూ.1,509 కోట్లు ఈ ఏడాది మార్చిలోనే రావడం విశేషం. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా రూ.12,500 కోట్ల రా బడి వస్తుందని ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో వేసి న అంచనాలో 99% ఆదాయం వచ్చింది. ఏడాది కాలంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కలి పి మొత్తం 19.80 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కరోనా లాక్డౌన్ వల్ల ఆదాయం గణనీయంగా తగ్గి రూ.228 కోట్లకే పరిమితమైనప్పటికీ.. జూన్ నుంచి మళ్లీ పుంజుకోవడం ప్రారంభమైంది.
ప్రభుత్వ విధానాల ఫలితమే
కేసీఆర్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రంలో రి యల్ ఎస్టేట్ రంగం అంచనాలకు మించి వృద్ధి చెందుతుండటంతో రికార్డు ఆదాయం వస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రిజిస్ట్రేషన్ల రాబడి ఏకంగా 468% పెరగటమే ఇందుకు నిదర్శనం. 2014-15 లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి రూ.2,175 కోట్లే. ఆ ఏడాది 9 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 2021-22 నాటికి రిజిస్ట్రేషన్లు 20 లక్షలకు దూసుకెళ్లడంతో ఆదాయం రూ.12,372 కోట్లకు పెరిగింది. 2020-21తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 136% అధిక ఆదాయం వచ్చింది. కరోనా మొదటి వే వ్, మూడు నెలల లాక్డౌన్ ఫలితంగా 2020-21లో కేవలం రూ.5,260 కోట్ల ఆదాయమే వచ్చింది.
ఈ ఏడాది మరింత జోరుగా..
2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు సాగుతున్నది. నెలన్నర రోజుల్లోనే 1.56 లక్షల వ్యవసాయేతర భూముల లావాదేవీలు జరగడంతో రూ.1,431 కోట్ల రాబడి వచ్చింది. రానురాను ఆదా యం మరింత పెరుగుతుందని ‘రియల్’ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తివేయడం, కొవిడ్ భయం తొలిగిపోవడం, రెండేండ్ల నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న వ్యాపార, వాణిజ్య రం గాలు ఇప్పుడు రెట్టించిన వేగంతో దూసుకెళ్తుండటం రిజిస్ట్రేషన్ల రాబడి పెరుగుదలకు దోహదం చేస్తాయని చెప్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.15,600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.