హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు… హైడ్రా కూల్చివేతలు… వెరసి గత రెండేండ్లుగా మూలుగుతున్న హైదరాబాద్ మహానగర రియల్ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడనున్నది. రెండేండ్లుగా ప్రభుత్వ ఆదా యం ఘోరంగా పడిపోవడంతో ఆ లోటును పూడ్చుకొనేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా భూముల ధరలను భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రభుత్వ ఆదేశానుసారం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు సమీపంలో మార్కెట్ వ్యాల్యూను నిర్ధారించేందుకు అధికారులు అన్నిరకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న భూముల ధరలను ఇప్పుడున్న దాని కంటే 3-4 రెట్లు అధికంగా పెంచడంతోపాటు అపార్టుమెంట్లల్లోని ఫ్లాట్ల ధరలను సైతం 60% దాకా పెంచేందుకు రంగం సిద్ధమైంది.
అంటే హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడు ఇల్లు కొన్నా… ఒక అపార్టుమెంట్లో చిన్న ఫ్లాటు కొన్నా ప్రస్తుతం చెల్లిస్తున్న రిజిస్ట్రేషన్ విలువ కంటే కనీసంగా రెండు, మూడు రెట్లు అధికంగా సమర్పించుకోవాల్సి వస్తుంది. రెండేండ్లుగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోవడంతో, రిజిస్ట్రేషన్ల వ్యాల్యూను భారీగా పెంచి ఖజానాను పూడ్చుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే దీనిని అమల్లోకి తెచ్చేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం తాత్కాలికంగా పక్కనబెట్టినట్టు తెలిసింది. ఎన్నిక ముగిసిన వెంటనే ఒక్కసారిగా భూములు, ఫ్లాట్ల ధరలను పెద్ద ఎత్తున పెంచి అమల్లోకి తేవడం ఖాయమని అధికారికవర్గాలు చెప్తున్నాయి.
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో కోటి రూపాయలున్న ఎకరం భూమి ధర రూ.పది కోట్లయింది. రూ.40-50 లక్షలున్న అపార్టుమెంటు విలువ రూ.కోటి దాటింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రభుత్వ ధరలను పెంచలేదు. మార్కెట్ విలువలు ఏస్థాయిలో పెరిగినా సామాన్యులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అది పెనుభారంగా మారొద్దని ప్రభుత్వపరంగా భూములు, ఫ్లాట్ల ధరలను భారీగా పెంచలేదు. రియల్ఎస్టేట్ రంగం దేదీప్యమానంగా వెలగడానికి ఇదీ ఓ కారణమని రియల్ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. తద్వారా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి ఆదాయం భారీగా వచ్చేది. రియల్ఎస్టేట్ రంగం బలోపేతం కావడంతో దాని అనుబంధ రంగాలు, ఇతర రంగాలపైనా అనుకూల ప్రభావం ఉండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొదలు తెలంగాణలో… మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రియల్ఎస్టేట్ రంగం కునారిల్లిపోతున్నది.
హైడ్రా కూల్చివేతలతో రియల్-నిర్మాణ రంగాలు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ ఆదాయం కేసీఆర్ హయాంలో ఏటా రూ.14-15వేల కోట్లు దాటగా, ఇప్పుడు 37-40% తగ్గుదల నమోదవుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18,228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, రూ.8,473 కోట్లు మాత్రమే వచ్చింది. రూ.9,755 కోట్ల ఆదాయం తగ్గిందంటే రియల్-నిర్మాణ రంగం ఎంతలా కుదేలైందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ఆదాయం తగ్గడంతో ప్రజలపై అదనపు భారాన్ని మోపి దానిని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారులకు మూడు నెలల కిందటే ఆదేశాలు వెళ్లగా, భారీ కసరత్తు చేసిన అధికారులు చివరకు ప్రభుత్వ సూచన మేరకు రిజిస్టేషన్ల వ్యాల్యూను పెద్ద ఎత్తున పెంచి ప్రతిపాదనలను సిద్ధం చేసి సర్కారుకు అందజేశారు.
హైదరాబాద్ మహానగర పరిధిలో అవుటర్ రింగు రోడ్డు వరకు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలోని భూములు, అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల విలువల పెంపుపై ప్రభుత్వం ప్రధానంగా పరిగణనలోనికి తీసుకున్న సూత్రం… బహిరంగ మార్కెట్ రేటు. వాస్తవానికి ఇది నిలకడగా ఉండదు. పైగా అమ్మేవారు, కొనేవారితోపాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇవి మారుతూ ఉంటాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బహిరంగ మార్కెట్‌ను పరిగణనలోనికి తీసుకొని పెంపు ప్రతిపాదనలను రూపొందించింది. ఉదాహరణకు… ఒక ప్రాంతంలో ఎకరా రూ.20-30 కోట్ల ధర బహిరంగ మార్కెట్లో ఉంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తకాల్లో (బుక్ వ్యాల్యూ) రూ.ఒకటిన్నర, రూ.రెండు కోట్లు కూడా లేదు. కానీ, ఇప్పుడు బయటి మార్కెట్ ధరను పరిగణనలోనికి తీసుకోనుండటంతో ప్రభుత్వపరంగానే ఎకరా ధర రూ.4-6 కోట్ల వరకు పెరగనున్నది. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గతంలో కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ చెల్లించుకోవాలి.
అదేవిధంగా ఒక ప్రాంతంలో చదరపు గజం ఇప్పుడు రూ.10వేలుంటే బహిరంగ మార్కెట్లో రూ.40-50వేల వరకు ఉంటుంది. ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న రూ.10వేలను రెండున్నర, మూడు రెట్లు అంటే చదరపు గజం విలువను రూ.25-30వేలకు పెంచనున్నది. ఇలా 200 చదరపు గజాల ప్లాటు కొనాలంటే గతంలో రూ.లక్షన్నరతో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. ఇకనుంచి అది రూ.3.75 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు చెల్లించుకోవాల్సిందే. అపార్టుమెంట్లల్లోని ఫ్లాట్ల ధర చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న రేటును ఏకంగా 60% వరకు పెంచాలని ప్రతిపాదించారు. ఉదాహరణకు… జూబ్లీహిల్స్‌లోని అపార్టుమెంట్లల్లో ఫ్లాటు ధర చదరపు అడుగుకు రూ.6వేలుగా ఉంటే 60% అంటే మరో రూ.3,600 పెరిగి, చదరపు అడుగుకు రూ.9,600 కానున్నది. దీంతో 1,150 చదరపు అడుగులు ఉన్న ఫ్లాటును కొనాలంటే గతంలో రిజిస్ట్రేషన్‌కు సుమారు రూ.5.17 లక్షల వరకు అయ్యేది. ఇక ముందు రూ.8.28 లక్షల వరకు కానున్నది. ఇలా భూములు, ఫ్లాట్ల విలువలను భారీగా పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చును సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున రాబట్టాలనేది సర్కార్ వ్యూహంగా స్పష్టమవుతున్నది.
కొనేవాళ్లుంటేనే అమ్మేవాళ్లకు పండుగ! ఇలా ఇద్దరూ ఉంటేనే ప్రభుత్వానికి రాబ డి.. ఆయా రంగాల్లో వృద్ధి. గత రెండేండ్లుగా రాష్ట్రంలో అందునా హైదరాబాద్ మహానగరంలో రియల్-నిర్మాణ రంగాల పరిస్థితి దయనీయంగా తయారైంది. బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సైతం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ఆదాయమే మనుపటికంటే 37-40% తగ్గిందంటే మార్కెట్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో అర్థమవుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం వచ్చిన వాళ్లను ముక్కుపిండి ఖజానా లోటును భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం మూలిగే నక్కపై తాటిపండు పడటమేనని రియల్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఖజానా లోటు పూడ్చుకోవాలని చేసే ప్రయత్నం అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలే మార్కెట్ లేక డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌కు అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగితే ముందుకొచ్చే వాళ్లు కూడా వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందని రియల్ఎస్టేట్ రంగ నిపుణుడు ఒకరు స్పష్టంచేశారు. దీంతో కొనేవారిపై పెను భారం ఒకవంతైతే… రియల్-నిర్మాణ రంగాలు పడిపోయి బహిరంగ మార్కెట్లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
