Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. పట్టపగలే చెరువులు, కుంటల్లో నుంచి బంకమట్టిని అక్రమంగా తరలిస్తున్నది. కొమాండ్ల చెరువు కట్టమట్టిని సైతం తోడేసింది. పంట పొలాల్లో ఒండ్రుమట్టి పోసుకుంటామని అనుమతులు తీసుకొని కొందరు, ఎలాంటి అనుమతులు లేకుండా మరికొందరు మట్టి అమ్మకాలకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వెంచర్లు, ఇండ్ల స్థలాలకు పెద్దమొత్తంలో తరలిస్తు న్నారు.
జిల్లాలోని ప్రతి మండలంలో రాత్రి వేళ మట్టి దందా గుట్టుగా కొనసాగుతుండగా, భూపాలపల్లి మండలంలో మాత్రం పట్టపగలే చెరువు మట్టిని డంపింగ్ కేంద్రాలకు తరలిస్తూ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సవాల్ విసురుతున్నారు. భూపాలపల్లి మండలంలోని సోలిపేట చెరువు మట్టిని తోడేస్తున్నారు. నెల రోజుల క్రితం రాత్రివేళల్లో మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా ఐబీ అధికారులు అడ్డుకున్నారు.
రెవెన్యూ అధికారులు సైతం జేసీబీని స్వాధీనం చేసుకున్నారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి పట్టపగలే చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. గోరికొత్తపల్లి మండలంలోని రామయ్యకుంట, లంబడికుంట, కుదురుకుంట, రసల్కుంటల్లో అక్రమార్కులు రాత్రి వేళ జేసీబీలతో మట్టిని అక్రమంగా తరలించారు. రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. కొమాండ్ల చెరువు కట్ట మట్టిని సైతం తోడేశారని రైతులు మొత్తుకున్నా స్పందన కరువైంది. రోజుకు వందల ట్రాక్టర్లతో ఈ దందా జరుపుతూ రూ. లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అనుమతులు లేవు
చెరువుల్లో మట్టి తరలింపునకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. అత్యవసరమైతే కొంతమేరకు పొలాలకు అనుమతి ఇస్తున్నాం. అయితే అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. మా సిబ్బందితో మట్టి తరలింపును అడ్డుకుంటున్నాం. సోలిపేట చెరువులో మేము మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– బసవప్రసాద్, ఐబీ డీఈ
ఇసుక మాఫియాను మించి
ఇసుక మాఫియాను మించి మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. మా గ్రామ శివారులోని సోలిపేట చెరువులోని మట్టిని నెల రోజులుగా పట్టపగలే తోడుతున్నారు. రోజుకు 30 ట్రాక్టర్లు విరామం లేకుండా మట్టిని ప్రైవేటుకు తరలిస్తున్నాయి. ట్రాక్టర్ మట్టికి రూ.500 వసూలు చేస్తున్నారు. పొలాలు, మోరంచపల్లి గ్రామం పేరుతో మట్టిని బయటకు అమ్ముకుంటున్నారు. చెరువులో మట్టి పోయి మొరం తేలుతున్నది. అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.
– రవి, మాజీ సర్పంచ్, మోరంచపల్లి, భూపాలపల్లి